‘సిరివెన్నెల’కు న్యాయం చేయలేకపోయా – త్రివిక్రమ్

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి ఇచ్చిన స్పీచ్ ఎన్నో ఏళ్ల నుంచి యూట్యూబ్‌లో కోట్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంటోంది. సిరివెన్నెల గురించి అంతకంటే గొప్పగా ఇంకెవరూ మాట్లాడలేరు అనిపిస్తుంది ఆ స్పీచ్ చూస్తే. అందులోని మాటలు కల్ట్ స్టేటస్ తెచ్చుకున్నాయి. ఇప్పటికీ మీమ్స్‌లో, సినిమా డైలాగుల్లో త్రివిక్రమ్ మాటల్ని విరివిగా వాడుతుంటారు. కాగా సిరివెన్నెల మరణానంతరం ఓ టీవీ ఛానెల్ నిర్వహిస్తున్న ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి తాజాగా అతిథిగా వచ్చిన త్రివిక్రమ్.. మరోసారి తన అభిమాన గేయ రచయిత గురించి గొప్పగా మాట్లాడారు.

సిరివెన్నెల రాసిన అనేక పాటల గురించి విశ్లేషించే ప్రయత్నం చేసిన త్రివిక్రమ్.. ఆయన సాహిత్యానికి చాలామంది దర్శకులు న్యాయం చేయలేకపోయారని.. అందులో తాను కూడా ఒకడినని చెప్పారు. ‘జల్సా’లో బాగా పాపులర్ అయిన ‘ఛలోరే..’ పాట కోసం సిరివెన్నెల 30 వెర్షన్లు రాసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు.

‘‘నువ్వే కావాలి సినిమాలో అనగనగా ఆకాశం.. పాట రాసేటపుడు శాస్త్రి గారితో నా అనుబంధం బలపడింది. ఆయన రాసిన పాటలకు చాలామంది దర్శకులు న్యాయం చేయలేకపోయారు. నేను అయితే కచ్చితంగా న్యాయం చేయలేదనిపిస్తుంది. ఆయన పదాలకు సరిపడేలా చిత్రీకరించడం కుదరదు. అంత గొప్పగా ఉంటాయి. ఆయనకు సన్నివేశాన్ని వినిపించడానికి నాకు సిగ్గేసేది. ఆయన బాధ పడుతూ వినేవారు. కష్టంగా రాసేవారు. కానీ అందరూ ఆయన కంటే తెలివైన వారే అనుకుంటారు. ప్రేక్షకులకు అన్నీ తెలుసని వాళ్లను ఒప్పించాలి అనే భావనలో ఉండేవారు. ‘జల్సా’లో ‘ఛలోరే..’ పాటకు 30 వెర్షన్లు రాసి ఇచ్చారు. అందులో రెండు వెర్షన్లే తీసుకున్నాం. ఈ జనరేషన్ కూడా ఆయన పాటలు వింటున్నారంటే వాటికి ముగింపు ఉండదు’’ అని త్రివిక్రమ్ అన్నారు.