మొదటి రోజు వసూళ్లు – అర్జున్ సర్కార్ సిక్సర్

థియేటర్లలో అడుగు పెట్టిన మొదటి రోజే హిట్ 3 ది థర్డ్ కేస్ డీల్ చేసిన అర్జున్ సర్కార్ సిక్సర్ కొట్టేశాడు. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం ఫస్ట్ డే 43 కోట్లకు పైగా గ్రాస్ వసూలయ్యింది. గ్రౌండ్ రిపోర్ట్స్ కొంచెం అటుఇటుగా ఉండొచ్చు కానీ నాని నిన్న ర్యాంపేజ్ ఆడించిన మాట వాస్తవం. సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఉన్నా, ఫామిలీస్ పిల్లలు దూరంగా ఉండమని నానినే స్వయంగా చెప్పినా ఇంత వసూళ్లు నమోదు కావడం ఊహించనిది. నిజానికి హైప్ కొంత మిశ్రమంగా ఉండటం చూసి రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. కానీ ఆ భయమేమీ అక్కర్లేదని మూడు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి.

సుమారు నలభై రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని అధిక శాతం థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలడాయి. కొన్ని చోట్ల టికెట్లకు డిమాండ్ పెరిగిపోయి రైడ్ 2కి కేటాయించిన కొన్ని షోలు హిట్ 3కి సర్దుబాటు చేయాల్సి వచ్చిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ జోరు ఎన్ని రోజులు కొనసాగుతుందనేది ఫైనల్ స్టేటస్ నిర్ణయించబోతోంది. హిట్ 3కి హిట్ టాక్ వచ్చింది నో డౌట్. కాకపోతే యునానిమస్ గా అన్ని వర్గాలు చూసే కంటెంట్ కాదు కాబట్టి కుటుంబ ప్రేక్షకుల మద్దతు లేకుండా ఎలాంటి నెంబర్లు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. వీకెండ్ మొత్తం నాని కంట్రోల్ లోనే ఉండబోతోంది.

నిన్న దిల్ రాజు అన్నట్టు థియేటర్లకు హిట్ 3 ఊపిరినిచ్చింది. ప్రమోషన్లు చేసి జనాల్లో ఆసక్తి పెంచితే టికెట్లు కొని మరీ హాళ్లకు వస్తారని  ఋజువు చేసింది. యుఎస్ వెళ్తున్న నాని అక్కడ పబ్లిసిటీని ప్రత్యేకంగా చేయబోతున్నాడు. ఇప్పటికే వన్ మిలియన్ మార్కు దాటేయడంతో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల వరకు టెన్షన్ అక్కర్లేదు. వచ్చే వారం శుభం, సింగిల్ రిలీజులు ఉన్నాయి కానీ హిట్ 3 రేంజ్ బడ్జెట్, క్యాస్టింగ్ ఉన్నవి కాకపోవడంతో నాని కనీసం రెండు వారాలు స్టడీగా బ్యాటింగ్ చేయొచ్చు. ఏదేమైనా నాని మరో ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.