మే వచ్చినా మౌనంలోనే వీరమల్లు

మే నెల వచ్చేసింది. ఇంతకు ముందు చెప్పిన ప్రకారం తొమ్మిదో తేదీ రావాల్సిన హరిహర వీరమల్లు నిర్మాణ సంస్థ చెప్పకుండానే తనంతట తానే వాయిదా పడిపోయింది. దాని స్థానంలో సింగిల్, శుభం వస్తున్నాయి. సరే పోనీ రెండు మూడు వారాలు ఆలస్యంగా అయినా వస్తుందా అంటే ఆ సూచనలూ కనిపించకపోవడం ఫాన్స్ లో ఆందోళన రేపుతోంది. పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సిన నాలుగైదు రోజుల డేట్లకు ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న పవన్ షూటింగ్ కు సరిపడా కాల్ షీట్స్ ఇవ్వలేకపోవడం రిలీజ్ డేట్ నిర్ణయం మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

ఈ లెక్కన మేలో లేదంటే నెక్స్ట్ ఆప్షన్ జూనే. అదైనా పక్కాగా ఫిక్స్ చేసుకుని ఎలాంటి పోస్ట్ పోన్లు లేకుండా విడుదల తేదీ ప్రకటిస్తే అభిమానులు రిలాక్స్ అవుతారు. అసలే ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి బజ్ లేకపోవడం కొనాలని చూస్తున్న బయ్యర్ల మదిలో సవాలక్ష అనుమానాలు రేపుతోంది. పోనీ ఏదైనా ట్రైలర్ లాంటి ప్రమోషన్ కంటెంట్ తో వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అంటే అదీ లేదు. దర్శకుడు జ్యోతి కృష్ణ పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. నిర్మాత ఏఎం రత్నం అసలు బయట కనిపించడమే మానేశారు. పోనీ కీరవాణిని ఏమైనా అడుగుదామా అంటే దర్శనం అపురూపమైపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లుని త్వరగా తీసుకురావడం ఎలాగో అంతు చిక్కడం లేదు. జూన్ 20, 27 తేదీల్లో కుబేర, కన్నప్ప లాంటి ప్యాన్ ఇండియా సినిమాలున్నాయి. వాటిని డిస్టర్బ్ చేయడం న్యాయం కాదు. సో మొదటి రెండు వారాల్లో రావడం మంచి నిర్ణయం అవుతుంది. లేదూ జూలైకు వెళ్లే ఆప్షన్ కూడా చూడొచ్చు కానీ ఇంతకీ విశ్వంభర రావాలనుకున్న ప్లాన్ ఏమయ్యిందో అర్థం కావడం లేదు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన వీరమల్లులో బాబీ డియోల్ ఔరంగజేబుగా కీలక పాత్ర పోషించాడు. పార్ట్ 1 కే ఇన్ని బాలారిష్టాలు ఉంటే ఇంకా రెండో భాగం విషయంలో ఇంకెన్ని చిక్కుముడులు వస్తాయో.