న్యాచురల్ స్టార్ నాని జెర్సీతో తెలుగులో పేరు సంపాదించుకున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ కు తర్వాత అవకాశాలు పెద్ద మోతాదులో రాలేదు. కృష్ణ అండ్ హిజ్ లీల లాంటివి కొంచెం ఇమేజ్ తెచ్చినప్పటికీ సరైన బ్రేక్ రాకపోవడంతో చాలా త్వరగానే వెంకటేష్ లాంటి సీనియర్ హీరోకు జోడిగా నటించాల్సి వచ్చింది. అయితే సైంధవ్ ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. అందుకే మెకానిక్ రాకీ, డాకు మహారాజ్ లో సపోర్టింగ్ రోల్స్ కు సైతం ఎస్ చెప్పింది. చాలా సంవత్సరాల తర్వాత తనో ప్రధాన పాత్రలో ఒక ప్యాన్ ఇండియా మూవీ వస్తోంది. అదే కలియుగమ్ 2064. వచ్చే మే 9 విడుదలకు రెడీ అవుతోంది.
ఇవాళ ట్రైలర్ వచ్చింది. రెండు నిమిషాల వీడియోలో కథ దేని దేని గురించో చెప్పారు. 2064 సంవత్సరంలో ప్రపంచం మొత్తం అంతరించిపోయి అతి కొద్ది మానవాళి మిగులుతుంది. తిండి, బట్ట అపురూపంగా మారిపోయి వాటి కోసం యుద్ధాలు, హత్యలు చేసే పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటి స్మశాన వైరాగ్యం ఉన్న చోట శ్రద్ధ శ్రీనాథ్, కిషోర్ చిక్కుకుంటారు. సాటివాళ్ళ కోసం ఏదైనా తీసుకెళదామనే పోరాటంలో కొత్త శక్తులతో తలపడాల్సి వస్తుంది. అదేంటో స్క్రీన్ మీద చూడాలి. కల్కి 2898 ఏడికి దీనికి కథ పరంగా సంబంధం తక్కువే అయినా కొన్ని సారూప్యతలు కనిపిస్తున్నాయి.
రెండు కలియుగం చివరి అంకాన్ని అంటే భవిష్యత్తుని ఆధారంగా చేసుకున్నావే. కాకపోతే కల్కిలో తెరనిండా ఆరిస్టులు ఉంటే కలియుగమ్ లో తక్కువ క్యాస్టింగ్ కనిపిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, హాలీవుడ్ తరహాలో నో మ్యాన్స్ ల్యాండ్ వాతావరణం అన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి. ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యూచర్ కాన్సెప్ట్ థ్రిల్లర్ కు డాన్ విన్సెంట్ సంగీతం సమకూర్చారు. హరిహర వీరమల్లు తప్పుకోవడంతో ఖాళీగా ఉండిపోయిన మే 9 డేట్ ని కలియుగమ్ 2064 తీసేసుకుంది. ఇంత గ్యాప్ తర్వాత శ్రద్ధ శ్రీనాథ్ కు పెర్ఫార్మన్స్ చూపించుకునే పాత్ర దక్కింది కనక దాన్నెలా ఉపయోగించుకుంటుందో చూడాలి.