కెజిఎఫ్ తర్వాత సరైన అవకాశాలు రాక, వచ్చినా కోబ్రా లాంటివి ఆశించిన స్థాయిలో ఆడలేక ఇబ్బంది పడుతున్న శ్రీనిధి శెట్టికి హిట్ 3 రూపంలో భలే ఛాన్స్ దొరికింది. కథ ప్రకారం చూసుకుంటే తన పాత్రకు ప్రాధాన్యం ఉండొచ్చేమో కానీ కథ కోణంలో చూస్తే వయొలెన్స్ నిండిన ఇంత ఇంటెన్స్ డ్రామాలో ఆమెకు పెర్ఫార్మన్స్ పరంగా ఎక్కువ స్కోప్ దొరక్కపోయి ఉండొచ్చు. అయినా సరే ప్రమోషన్ల బాధ్యతను నానితో సమానంగా భుజాన వేసుకుని హైదరాబాద్ తో మొదలుపెట్టి ముంబై, కోచి, బెంగళూరు, చెన్నై అంటూ అడిగిన ప్రతి చోటికి వెళ్లి అడిగినన్ని ఇంటర్వ్యూలు చాలా ఓపికతో ఇస్తూ నానికి బరువు తగ్గించే పని చేస్తోంది.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీనిధి శెట్టిలో ఉన్న చలాకీతనం, కామెడీ టైమింగ్ అన్నీ హిట్ 3 ప్రమోషన్లలో బయట పడుతున్నాయి. పద్ధతైన చీరలు, కాస్ట్యూమ్స్ తో అలరించుకుని వస్తున్న తీరు, నానితో కెమిస్ట్రీ, యాంకర్లతో మెలుగుతున్న విధానం ఇవన్నీ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. వీటికి తోడు హిందీ, తెలుగు, తమిళంలో అనర్గళంగా మాట్లాడుతున్న వైనం అభిమానులను మరింత దగ్గరగా చేస్తోంది. హిట్ 3 బ్లాక్ బస్టర్ అయితే ముందు పేరు వచ్చేది నాని, శైలేష్ కొలనుకి. ఆ తర్వాత విలన్ ఎవరనే దాన్ని బట్టి శ్రీనిధి శెట్టికి ఎంత క్రెడిట్ శాతం దక్కుతుందనేది మే 1 థియేటర్లలో చూశాక తేలుతుంది.
అభినందించాల్సిన పాయింట్ మరొకటి ఉంది. చాలా ఓపికగా ఇన్నేసి ప్రమోషన్లలో హీరోయిన్లు పాల్గొనడం అరుదు. నాని హీరో కం నిర్మాత కాబట్టి ఎంత కష్టమైనా తనకు సంతోషంగానే ఉంటుంది. కానీ శ్రీనిధి శెట్టికి అలా కాదు. అయినా సరే ఇంత కమిట్ మెంట్ చూపించడం ఆకట్టుకుంటోంది. రిలీజ్ కనీసం రెండు వారాలు ముందు నుంచి క్యాస్టింగ్ కనక పబ్లిసిటీలో పూర్తి స్థాయిలో భాగమైతే బజ్ ఎంత బాగా పెంచవచ్చో హిట్ 3 నిరూపిస్తోంది. సుమారు నెలన్నరకు బాగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే బాధ్యత ఈ సినిమా మీదే ఉంది. ఇదే ఏడాది ద్వితీయార్థంలో శ్రీనిధి శెట్టి మరో సినిమా తెలుసు కదా రిలీజవుతుంది.