పైన హెడ్డింగ్ చదవగానే అరే మిస్సయ్యామే అనే ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది. అలాంటిదే అభిమానులు ఎదురు చూస్తున్న విక్టరీ వెంకటేష్, న్యాచురల్ స్టార్ నాని కలయిక. హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాని ఈ విశేషం పంచుకున్నాడు. దాని ప్రకారం ఈ కాంబినేషన్ తో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా అనుకున్నారట. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఎందుకనేది తెలియదు కానీ ఈ మధ్య మాటల మాంత్రికుడిని కలిసే సందర్భం రాలేదు కాబట్టి ఇంతకన్నా ప్రస్తుతానికి ఏం చెప్పలేనని, ఏం జరుగుతుందో తెలియదని అక్కడితో టాపిక్ ముగించాడు.
అంటే కొద్దివారాల క్రితం త్రివిక్రమ్ ఇలాంటి ప్లానింగ్ లో ఉన్నాడనే లీక్ వచ్చినప్పుడు నిజమా కాదా అనే సందిగ్ధత ఫ్యాన్స్ లో ఉండిపోయింది. అయితే అది వెంకీ, నానితో కలిసి అనేది మాత్రం ఎవరూ ఊహించలేదు. అల్లు అర్జున్ 23 కోసం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న త్రివిక్రమ్ దీనికన్నా ముందు బన్నీ అట్లీ సినిమా పూర్తి చేయాలి కాబట్టి ఎక్కువ సమయం దొరికే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అప్పటి దాకా వెయిట్ చేయడం కన్నా ఈలోగా ఒక ప్రాజెక్టు చేసేయొచ్చనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు టాక్ వచ్చింది. నేరుగా త్రివిక్రమ్ నే అడుగుదామంటే వేరే ఈవెంట్లకు సైతం గెస్టుగా రానంత బిజీగా ఉండటంతో సాధ్యం కాలేదు.
సరే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఈ కాంబో కుదిరితే బాగుంటుంది. భలే భలే మగాడివోయ్ నాని, నువ్వు నాకు నచ్చావ్ వెంకటేష్ తో కలిసి మల్లేశ్వరి మార్కు ఎంటర్ టైన్మెంట్ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఇస్తే ఆ ఫన్ వేరే లెవెల్ లో ఉంటుంది. నాని ఎదురు చూస్తున్నాడు కానీ ఇప్పట్లో జరిగేలా లేదు. హిట్ 3 ది థర్డ్ కేస్ తర్వాత ప్యారడైజ్ చేయబోతున్న నాని ఆ తర్వాత సుజిత్ తో చేతులు కలుపుతాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఓజిని పూర్తి చేసుకుని వచ్చే కండిషన్ తో. ఎలాగూ అది ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది కనక రూట్ క్లియర్ గా ఉంది. ఏది ఏమైనా నాని ప్లానింగ్ చూస్తుంటే మాత్రం మిగిలినోళ్లకు ముచ్చటగా, ఈర్ష్యగా అనిపిస్తుంది.