దేవర విలన్ చేయబోయే రాంగ్ రీమేక్ ?

దేవర, ఆదిపురుష్ తో టాలీవుడ్ కు దగ్గరైన సైఫ్ అలీ ఖాన్ మనకు విలన్ గా పరిచయమే కానీ హిందీలో తనకి హీరోగా ఇప్పటికీ డిమాండ్ బాగుంది. సెక్రెడ్ గేమ్స్ లాంటి వెబ్ సిరీస్ వల్ల ఓటిటి ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంది. అయితే ఇతను త్వరలో ఒక రీమేక్ చేయబోతున్నాడన్న వార్త ఆశ్చర్యం కలిగించేలా ఉంది. ఎందుకంటే డిజిటల్ వరల్డ్ విస్తృతమయ్యాక భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అన్ని రకాల కంటెంట్లను ఇంట్లో కూర్చుని చూసేస్తున్నారు. ఒకవేళ ఏదైనా రీమేక్ అనుకుంటే వీలైనంత త్వరగా చేసేయాలి. ఆలస్యం చేస్తే బజ్ రాదు. ఇంతకీ సైఫ్ ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టు ఏంటో చూద్దాం.

2016లో మోహన్ లాల్ ఒప్పం వచ్చింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మలయాళంలో ఘన విజయం అందుకుంది. తెలుగులోనూ డబ్ చేశారు. జడ్జ్ కూతురిని ఓ ఆగంతకుడు చంపబోతే గుడ్డివాడైన హీరో ఎలా కాపాడాడు అనే పాయింట్ మీద మంచి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు. రికార్డులు బద్దలు కొట్టలేదు కానీ డీసెంట్ హిట్టు కొట్టింది. ఇప్పుడా ఒప్పంనే సైఫ్ అలీ ఖాన్ తో ప్లాన్ చేస్తున్నారు ప్రియదర్శన్. ఈ కలయిక నిజమే కానీ అది ఒప్పం రీమేకనేది మాత్రం ఇద్దరూ బయటకి చెప్పడం లేదు. అంధుడిగా నటించబోతున్నానని సైఫ్ చెప్పడం, డైరెక్టర్ ఒకరే కావడం వార్తకు బలం చేకూర్చింది.

అయినా సుమారు పదేళ్ల పాత సినిమాని ఇప్పుడు తీయాలనుకోవడం సబబు కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే గత కొన్నేళ్లలో బాలీవుడ్ అత్యధిక రీమేక్ డిజాస్టర్లు చూసింది. అల వైకుంఠపురములో, హిట్ ది ఫస్ట్ కేస్, జెర్సీ, గద్దలకొండ గణేష్, తేరి, ఫారెస్ట్ గంప్, కాటమరాయడు, ఛత్రపతి, రాక్షసుడు ఇలా చాలా చిత్రాలు ఒరిజినల్ వెర్షన్ స్థాయిలో కనీసం పావు వంతు కూడా అందుకోలేదు. సైతాన్, దృశ్యం 2 లాంటి ఒకటి రెండు మాత్రమే సక్సెసయ్యాయి. అలాంటప్పుడు ఓటిటిలో దొరుకుతున్న ఒప్పంని ఇప్పుడు ఫ్రెష్ గా తీయడంలో ఔచిత్యం, నమ్మకం ఏంటో రిలీజయ్యాకే తెలుస్తుంది. త్వరలో షూట్ స్టార్ట్ కానుంది.