లోకనాయకుడు కమల్ హాసన్ వార్తల్లో నిలవడం మాములే కానీ ఇప్పుడు మాత్రం ఒక విచిత్ర కారణంతో హాట్ టాపిక్ అయ్యారు. ఇటీవలే జరిగిన తగ్ లైఫ్ ప్రెస్ మీట్లో హీరోయిన్ త్రిష ఒక ప్రశ్నకు సమాధానం తనకు ఉడకబెట్టిన అరటిపండు ఇష్టమని, కానీ దాని పేరు తెలియదని చెప్పింది. పక్కన ఉన్న కమల్ వెంటనే మైకు అందుకుని ఆమెకు పేరు తెలియదు కానీ నోట్లో పెట్టుకుని తినడం తెలుసని అనడంతో అక్కడున్న వాళ్ళు షాక్ తిన్నారు. నిజానికి ఇక్కడ రెండు అర్థాలున్నాయి. మొదటిది పాజిటివ్. ఉదాహరణకు మనకు దోసె వేయడం రాదనుకోండి, కానీ బాగా ఇష్టంగా తినడం తెలుసుంటుంది. అదేం తప్పు కాదు.
ఇంకో కోణం కొందరు నెటిజెన్లు ద్వందార్థం చేసుకున్న విధానంలో వస్తుంది కానీ కమల్ హాసన్ ఏ ఉద్దేశంతో అన్నారో ఆయనకు మాత్రమే తెలుసు. త్రిష బదులిస్తూ మీతో సెట్స్ కన్నా బయట ఫన్ లో ఎంజయ్ చేయొచ్చంటూ అక్కడితో టాపిక్ ముగించింది. ఈ వీడియో కాస్తా వైరలైపోయి క్షణాల్లో లక్షలాదికి పాకిపోయింది. కమల్ ఆన్సర్ ని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అన్వయించుకుంటూ చిలిపి ఆండవర్ అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు రొమాన్స్ లో కమల్ ని కొట్టేవారు లేరని ఫ్యాన్స్ మాట్లాడుకునేవాళ్ళు. ముఖ్యంగా ఆన్ స్క్రీన్ ముద్దుల ట్రెండ్ మొదలుపెట్టింది ఈ వెండితెర నాయకుడే.
సరే ఉద్దేశం ఏదైనా తగ్ లైఫ్ చర్చల్లోకి వచ్చేసింది. జూన్ లో విడుదల కాబోతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు మణిరత్నం దర్శకత్వం వహించడం వల్ల అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. నాయకుడు వచ్చిన 38 సంవత్సరాలకు ఈ కలయిక సాధ్యం కావడం బిజినెస్ పరంగా క్రేజ్ తీసుకొస్తోంది. త్రిషతో పాటు శింబు ప్రధాన పాత్ర పోషించిన తగ్ లైఫ్ కు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఇంకా నెలన్నర సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో కమల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముందు తమిళనాడుతో మొదలుపెట్టి అతి త్వరలో తెలుగు రాష్ట్రాలు, కేరళ, కర్ణాటకలో అడుగు పెట్టబోతున్నారు.