వీరమల్లు కోసం పవన్ యాక్షన్ కొరియోగ్రఫీ

మే 9 విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా పడుతుందనే పుకార్ల నేపథ్యంలో ఇప్పటిదాకా నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రమోషన్ల ఊసే లేకపోవడంతో ఫ్యాన్స్ దాదాపు పోస్ట్ పోన్ ఖాయమని ఫిక్స్ చేసుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వెంటనే వచ్చే పరిస్థితి లేకపోయినా ఇప్పటిదాకా జరిగిన భాగానికి సంబంధించిన ఇతర పనులు ఆగకుండా చేసుకుంటున్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం పగలు రేయి వీటి పర్యవేక్షణలోనే ఉన్నారట. రిలీజ్ డేట్ చేరుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. స్వయంగా జ్యోతి కృష్ణనే దీన్ని పంచుకున్నారు. ఈ విజువల్ గ్రాండియర్ లో మొత్తం ఆరు యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయి. వాటిలో ఇరవై నిముషాల పాటు వచ్చే ఒక కీలక ఘట్టం కంపోజ్ చేసే బాధ్యత స్వయంగా పవనే తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ స్టూడియోలో మొత్తం 1100 మంది హాజరు కాగా 61 రోజులకు పైగానే పవన్ నేతృత్వంలో చిత్రీకరించారు. దీని కోసం ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్స్ సహాయం తీసుకున్నారు. సినిమాలో మొదటి హైలైట్ గా దీని గురించే మాట్లాడుకుంటారని దర్శకుడు ధీమాగా చెబుతున్నారు.

ఇలా ఫైట్లను కంపోజ్ చేయడం పవన్ కు కొత్తేమి కాదు. గతంలో జానీ, డాడీల కోసం ఈ బాధ్యతని విజయవంతంగా నెరవేర్చాడు. అవి కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా పవన్ కు పేరు వచ్చింది. ఇదంతా బాగానే ఉంది కానీ ముందైతే వీరమల్లు విడుదల తేదీని మరోసారి ఖరారు చేయడం అత్యవసరం. మే 23 కొత్త డేట్ తెరమీదకు వచ్చింది కానీ ఏదీ నమ్మలేని అయోమయంలో అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ తో మీడియా కూడా ఉంది. వీటికి చెక్ పెట్టి వీలైనంత త్వరలో పబ్లిసిటీకి తెరతీస్తే తప్ప ఈ గందరగోళానికి తెరపడదు. స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో వస్తున్న పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 రావడానికి ఇంకెంత టైం పడుతుందో.