కన్నడ నుంచి మరో బిగ్ మూవీ

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం నుంచే రీమేక్ అయ్యేవి. కంటెంట్ పరంగానే కాక మార్కెట్ పరంగానూ కన్నడ సినిమా బాగా వెనుకబడి ఉండేది. కానీ గత దశాబ్ద కాలంలో శాండిల్‌వుడ్లో చాలా మార్పు వచ్చింది. కన్నడ సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగింది. కేజీఎఫ్, కాంతార, గరుడ గమన వృషభ వాహన, చార్లీ 777 సహా ఎన్నో టాప్ క్లాస్ సినిమాలు అక్కడి నుంచి వచ్చాయి. కమర్షియల్‌గా కూడా కన్నడ సినిమా రీచ్ బాగా పెరిగింది. ఇప్పుడు ఈ కోవలోనే కన్నడ నుంచి మరో సెన్సేషనల్ మూవీ రాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

కన్నడ టాప్ స్టార్లయిన శివరాజ్ కుమార్, ఉపేంద్ర‌లతో పాటు నటుడిగా, దర్శకుడిగా తక్కువ కాలంలోనే గొప్ప పేరు సంపాదించిన రాజ్‌.బి.శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఆ చిత్రమే.. 45. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘45’ మూవీ నుంచి తాజాగా టీజర్ వదిలారు. అందులో విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌‌గా ఉన్నాయి. కథేంటన్నది అర్థం కాలేదు కానీ.. విజువల్‌గా మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సాగింది టీజర్.

‘‘మనిషి చనిపోయాక ప్రేమ చూపించడం కంటే బతికుండాగా ఆ ప్రేమ చూపిస్తే బాగుంటుంది’’ అనే డైలాగ్‌తో టీజర్‌ను మొదలుపెట్టి రకరకాల విజువల్స్ చూపించారు. రాజ్.బి.శెట్టి పాత్రే సినిమాలో అత్యంత కీలకంగా ఉండేలా కనిపిస్తోంది. ఇక ఉపేంద్ర, శివరాజ్ కుమార్ డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు నేను అని ఉపేంద్ర డైలాగ్ చెబితే.. అందులో హీరో నేను అని అతడికి కౌంటర్ ఇచ్చాడు శివన్న. ఈ డైలాగ్స్ కూడా క్యూరియాసిటీ పెంచాయి. ట్రైలర్ వస్తే కథేంటన్నది ఐడియా రావచ్చు. ఉపేంద్ర దర్శకత్వం వహించే సినిమాలకు సంబంధించిన ప్రోమోలు ఇలాగే కథేంటో స్పష్టత లేకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతాయి. ఈ చిత్రాన్ని రూపొందించిన అర్జున్ సన్య కూడా అదే స్టయిల్లో సినిమా తీసినట్లున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.