వీరమల్లు చుట్టూ సమస్యల సైన్యం

ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ షూటింగ్ రాలేని పరిస్థితిలో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. మొన్న సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడి ఆందోళన రేకెత్తిస్తే ఆఘమేఘాల మీద పవన్ అక్కడికి చేరుకొని కుటుంబాన్ని అక్కున చేరుకున్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో తిరిగి రాబోతున్నారు. వచ్చే వారం రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన ఉంది. అందులోనూ పాల్గొనాల్సి రావొచ్చు. ఫ్యామిలీ, కెరీర్ కన్నా పదవి ఇచ్చిన బాధ్యత, రాజకీయం ముఖ్యమంటున్న పవన్ చాలా ఒత్తిడి మీదున్నారు.

ఇంకో నాలుగైదు రోజులు డేట్లు ఇస్తే అయిపోతుందనే టాక్ ముందు నుంచి వినిపిస్తూనే ఉంది కానీ చేతిలో ఉన్న అతి తక్కువ టైంలో పోస్ట్ ప్రొడక్షన్ అవగొట్టేసి, ప్రమోషన్లు చేసుకుని హైప్ పెంచడం సాధ్యమేనా అనే ప్రశ్న అభిమానుల నుంచే వస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆశించిన బజ్ లేదు. ఇదిలా ఉండగా ఓటిటి హక్కులు సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ ఈసారి కూడా థియేటర్ రిలీజ్ వాయిదా అంటే హక్కుల కోసం ఒప్పందం చేసుకున్న సొమ్ముని తగ్గించుకోవడమో లేదా అసలు మొత్తాన్నే రద్దు చేసుకోవడమో చేస్తామని నిర్మాతకు చెప్పినట్టుగా వచ్చిన వార్త ఫ్యాన్స్ లో కలకలం రేపుతోంది.

ఏతావాతా చూస్తే హరిహర వీరమల్లు మొదలైనప్పటి నుంచి చిక్కులు వస్తూనే ఉన్నాయి. మొదట కరోనా బ్రేక్ వేసింది. ఆ తర్వాత వర్షానికి సెట్లు కూలిపోయి తీవ్ర నష్టం కలిగింది. ఇంకోసారి ఆర్టిస్టుల డేట్లు దొరక్క షూట్ ఆగింది. ఈలోగా ఎన్నికలు, ప్రచారాలు, కూటమి అధికారంలోకి రావడం, జనసేన జయకేతనం లాంటి కారణాలు పవన కళ్యాణ్ ని బిజీగా మార్చేశాయి. డిప్యూటీ సిఎం అయ్యాక గ్యాప్ దొరికితే ఒట్టు. ఇంత పెద్ద పద్మవ్యూహంలో చిక్కుకున్న హరిహర వీరమల్లుని చూస్తుంటే అభిమన్యుడు గుర్తొస్తున్నాడు. అచ్చం తనలాగే ఎలా బయటికి రావాలో తెలియట్లేదు. కాకపోతే ఇప్పుడు పవనే అర్జునుడిగా మారాలి.