న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే మోస్ట్ వయొలెంట్ మూవీగా చెప్పబడుతున్న ది ప్యారడైజ్ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళలేదు. హిట్ 3 ది థర్డ్ రిలీజయ్యాక దాని స్టేటస్ ఏంటో తేలేదాకా నాని పూర్తిగా ప్రమోషన్లకే అంకితం కాబోతున్నాడు. దీనికి తోడు నిర్మాణ పరంగా తలెత్తిన కొన్ని సమస్యల వల్ల ఒకటి రెండు నెలలు ఆలస్యం కావొచ్చేమో కానీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సర్వం సిద్ధం చేసుకుని ఉన్నాడు. వచ్చే ఏడాది మార్చి 26 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని టీమ్ ఘంటాపథంగా చెబుతోంది. ఇంకా సంవత్సరం టైం ఉన్నప్పటికీ బిజినెస్, హక్కుల పరంగా చాలా క్రేజ్ ఏర్పడినట్టు ట్రేడ్ రిపోర్ట్.
ఇదిలా ఉండగా ప్యారడైజ్ లో నాని తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన పాత్ర తల్లిది. టీజర్ లో చూపించిన ల*** పదానికి న్యాయం చేకూర్చే నటి కావాలి. మరీ అంత బోల్డ్ క్యారెక్టర్ గురించి చెప్పాక సహజంగానే టాలీవుడ్ సీనియర్లు నో అనే చెబుతారు. గత ఏడాది రమ్యకృష్ణను సంప్రదిస్తే కథ పట్ల సానుకూలంగా అనిపించినా ఫైనల్ గా నో చెప్పారనే టాక్ వచ్చింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు మదర్ అఫ్ ప్యారడైజ్ గా మధ్యవయసులో ఉన్న ఇతర భాషా నటిని తీసుకొస్తున్నారట. ఆవిడెవరో స్పష్టత లేదు కానీ ప్రస్తుతం లుక్ టెస్ట్, ఆడిషన్లు జరుగుతున్నాయని వినికిడి. ఫైనల్ గా కాగానే లాక్ చేస్తారు.
ఇది ఒకరకంగా మంచి నిర్ణయం. ఎందుకంటే మనోళ్ళనే తీసుకుంటే అంచనాలు పెరిగిపోయి ఏవేవో ఊహించుకుని ఈవిడ చేయకపోతే బాగుండేది లాంటి కామెంట్స్ వస్తాయి. అలాంటి సమస్య లేకుండా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని వాళ్ళను తీసుకొస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే పెర్ఫార్మర్ అయ్యుండాలి. శ్రీకాంత్ ఓదెల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడట. ఏ మాత్రం తేడా వచ్చినా పెద్ద రచ్చయ్యే ముఖ్యమైన పాత్ర ఇది. మరాఠి యాక్టరనే టాక్ వినిపిస్తోంది కానీ నిర్ధారణగా చెప్పాలంటే ఇంకొంత కాలం ఆగాలి. ఊహించని బోలెడు సర్ప్రైజులు షాకులు ప్యారడైజ్ లో శ్రీకాంత్ ఓదెల చూపించబోతున్నాడు.