ప్యాన్ ఇండియా నిర్మాతలూ….పారా హుషార్

అయిదారు నెలల క్రితం చిన్నగా మొదలై ఇప్పుడు శరీరమంతా పాకిన వ్యాధిగా మారిపోయిన హెచ్డి పైరసీ సికందర్ తో పతాక స్థాయికి చేరుకుంది. విడుదలకు కొన్నిగంటల ముందే మంచి క్వాలిటీతో ప్రింట్ బయటికి రావడం నిర్మాత మతిపోయేలా చేసింది. కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు చేపట్టినా అప్పటికే నష్టం దేశం దాటిపోయింది. గత ఏడాది మలయాళం సినిమాలతో మొదలైన ఈ వైరస్ ఆ తర్వాత తమిళంకు పాకి, ఇటు కన్నడ నుంచి తెలుగుకి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఏకంగా భాషతో సంబంధం లేకుండా నాకందరూ ఒకటే అనే స్థాయిలో ఆన్ లైన్ వేదికగా జడలు విరబోసుకుని డాన్సులు ఆడుతోంది.

గేమ్ ఛేంజర్, తండేల్, డాకు మహారాజ్, పుష్ప 2, కంగువ, సూక్ష్మదర్శిని, యువి ఇలా దీని బారిన పడిన సినిమాల లిస్టు రాసుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది కానీ ఇక ఆలోచించాల్సింది భవిష్యత్తు కార్యాచరణ గురించి. 2025లో చాలా ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. వంద నుంచి అయిదారు వందల కోట్ల దాకా బడ్జెట్ పెట్టినవి మే నెల నుంచి క్యూ కట్టబోతున్నాయి. హరిహరవీరమల్లు, విశ్వంభర, మిరాయ్, వార్ 2, కన్నప్ప, ఘాటీ, అఖండ 2, సంబరాల ఏటిగట్టు ఒకటి రెండు కాదు ఏకంగా పదికి పైగా ఇలాంటివి థియేటర్లకు రాబోతున్నాయి. వీటి ముందున్న అతి పెద్ద సవాల్ పైరసీ కాకుండా చూసుకోవడమే.

విదేశాల నుంచి ఇదంతా జరుగుతున్నా అసలు ఒరిజినల్ క్వాలిటీ ప్రింట్ ఎక్కడి నుంచి బయటికి వస్తుందనేది కని పెట్టాలి. ఎడిటింగ్ రూమ్, డిజిటల్ అప్లోడర్స్, ఫారిన్ కు పంపే హార్డ్ డిస్కులు, విఎఫెక్స్ కంపెనీలకు ఇచ్చే కాపీ, ప్రైవేట్ స్క్రీనింగ్ చెకింగ్ కోసం నిర్మాత పెట్టుకునే వెర్షన్ ఇలా రకరకాల మార్గాలు ఒక సినిమా బయటికి లీకయ్యేందుకు ఉన్నాయి. అసలు తప్పు ఎక్కడ జరుగుతోందనేది గుర్తిస్తే చేసిందెవరో కనుక్కుని పట్టుకోవచ్చు. అలా కాకుండా రిలీజ్ టైంలో హడావిడి చేసి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల లాభం లేదు. దిల్ రాజు అన్నట్టు అందరూ ఇది తమ సమస్యగా భావించి కంటిన్యూగా పోరాడితే తప్ప పరిష్కారం దొరకదు.