బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్ వీకెండ్ క్యాష్ చేసుకోవడం కోసం నిర్మాతలు ఆ డేట్ మీద పెద్ద కన్నే వేశారు. జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ వార్ 2 ఒక రోజు ముందు అంటే ఆగస్ట్ 14 వస్తున్న సంగతి తెలిసిందే. ఉన్న కాసిన్ని అనుమానాలను నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఇటీవలే నివృత్తి చేసింది. ఖచ్చితంగా చెప్పిన తేదీకే వస్తామని స్పష్టం చేసింది. ఈ కారణంగానే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలికి వేరే ఆప్షన్ కోసం చూస్తున్నారు నిర్మాతలు. కానీ ఒక కన్నడ ప్యాన్ ఇండియా మూవీ ఐ డోంట్ కేర్ అంటూ క్లాష్ కి సిద్ధపడుతోంది.
శాండల్ వుడ్ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటించిన 45 టీజర్ ఇవాళ వచ్చింది. నిమిషం వీడియోలో ఎంత వెరైటీ కంటెంట్ ఇవ్వబోతున్నారో శాంపిల్ చూపించారు. వీళ్ళతో పాటు రాజ్ బి శెట్టి కూడా ఒక ప్రధాన పాత్ర చేయడం అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాను ఆగస్ట్ 15 రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంటే వార్ 2 ఉందని తెలిసి కూడా రిస్క్ చేస్తున్నారంటే చాలా బలమైన నమ్మకం ఉన్నట్టేగా. అర్జున్ జన్య సంగీతం, రచన , దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ సైకాలజిక్ థ్రిల్లర్ చాలా పెద్ద బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
ఈ లెక్కన వార్ 2 రావడం గురించి కొన్ని అనుమానాలు ఇతర ఇండస్ట్రీలలో ఉన్న విషయం అర్థమవుతోంది. ఇంకా నాలుగున్నర నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలుకావడం చూస్తే ఆ సీజన్ ఎంత ముఖ్యమైందిగా మారిందో వేరే చెప్పనక్కర్లేదు. ఇక కూలీ ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఆగస్ట్ చివరి వారం వైపు కన్నేస్తోంది. సన్ పిక్చర్స్ మాత్రం ఒకవేళ వార్ 2 కనక చివరి నిమిషంలో తప్పుకుంటే కూలిని రిలీజ్ చేయాలనే ఆప్షన్ తో రెడీ అవుతోంది. ఈ లెక్కలేవి వేసుకోకుండా 45 ఇంత ధైర్యంగా డేట్ వేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగుతో సహా మొత్తం అయిదు భాషల్లో దీన్ని తీసుకొస్తున్నారు.