హృతిక్ చేస్తోంది చాలా పెద్ద రిస్కు

నిన్న క్రిష్ 4 ప్రకటన వచ్చింది. రాకేష్ రోషన్, ఆదిత్య చోప్రాలు సంయుక్త నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. కొద్దిరోజుల క్రితం బడ్జెట్ కారణంగా ఇది క్యాన్సిలవుతుందనే వార్తల నేపథ్యంలో హఠాత్తుగా అనౌన్స్ మెంట్ ఇవ్వడం గమనార్హం. అయితే అసలు ట్విస్టు ఇది కాదు. హీరో హృతిక్ రోషనే స్వయంగా దర్శకత్వం వహించేందుకు పూనుకోవడం. ఎందుకంటే ఇది చాలా పెద్ద రిస్క్. సాధారణంగా బాలీవుడ్ స్టార్లు డైరెక్షన్ కు దూరంగా ఉంటారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి దిగ్గజాలు దీని జోలికి వెళ్ళలేదు. అమీర్ ఖాన్ తారే జమీన్ పర్ తో ఋజువు చేసుకున్నాడు కానీ ఇప్పుడు సీక్వెల్ బాధ్యతలు వేరొకరికి అప్పగించాడు.

ఇలాంటి నేపథ్యంలో హృతిక్ రోషన్ ఇంత పెద్ద బాధ్యతను నెత్తిన వేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఏదో పెద్దగా బడ్జెట్ అక్కర్లేని రొమాంటిక్ ఎంటర్ టైనర్ అంటే ఏదో అనుకోవచ్చు. కానీ క్రిష్ 4 అలా కాదు. పేపర్ మీద నాలుగు వందల కోట్లకు పైగా డిమాండ్ చేస్తోందట. దానికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవసరమయ్యే సబ్జెక్టు. రాజమౌళి పీక్స్ కి చేరని టైంలో క్రిష్ అద్భుతాలు చేసింది కానీ ఆ తర్వాత రోబో, 2.0, ఆర్ఆర్ఆర్ లాంటివి గ్రాండియర్ పదానికి కొత్త అర్థం తీసుకొచ్చాయి. సో క్రిష్ 4 వీటిని దాటే స్థాయిలో ఉంటే తప్ప ఆడియన్స్ అంగీకరించరు. ఇది ఒక రకంగా పెను సవాల్ లాంటిది.

మరి హృతిక్ దీన్ని ఎంతమేరకు నెరవేరుస్తాడో చూడాలి. క్రిష్ 4 క్యాస్టింగ్, టీమ్ తదితర వివరాలు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతానికి 2027 విడుదలని టార్గెట్ గా పెట్టుకోబోతున్నారని ముంబై టాక్. హిందీలో ఏమో కానీ తెలుగులో నటించడంతో పాటు దర్శకత్వం చేస్తూ బ్లాక్ బస్టర్లు సాధించిన హీరోల లిస్టు చెప్పుకోదగ్గదే ఉంది. సూపర్ స్టార్ కృష్ణ, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ ఎన్నో మర్చిపోలేని క్లాసిక్స్ ఇచ్చారు. ఇప్పటి జనరేషన్ లో విశ్వక్ సేన్ ఒక్కడే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సిద్దు జొన్నలగడ్డ రైటర్ గా తన ముద్ర చూపిస్తున్నాడు. రెండో తరం సీనియర్ స్టార్లలో ఎవరూ దీని జోలికి వెళ్ళలేదు.