సుధీర్ బాబు పాత సినిమా


మ‌హేష్ బావ అనే గుర్తింపుతోనే కెరీర్లో కొంత కాలం బండి న‌డిపించాడు సుధీర్ బాబు. కెరీర్ ఆరంభంలో అత‌డికి ఆశించిన విజ‌యాలు ద‌క్క‌లేదు. పైగా న‌ట‌న‌, లుక్స్ విష‌యంలో విమ‌ర్శ‌లూ ఎదుర్కొన్నాడు. కానీ స‌మ్మోహ‌నం సినిమా సుధీర్ బాబు కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. న‌టుడిగా మంచి పేరు తెచ్చింది. స‌క్సెస్ కూడా అందించింది. న‌న్ను దోచుకుందువ‌టే సైతం సుధీర్‌కు బాగానే క‌లిసొచ్చింది.

ఇప్పుడు సుధీర్‌కు న‌టుడిగా పేరుంది. కొంత మార్కెట్టూ వ‌చ్చింది. వి సినిమా ఆడి ఉంటే అత‌డి రేంజ్ ఇంకా పెరిగేదే. ఆ సినిమాతో నిరాశ‌ప‌డ్డ సుధీర్.. త‌న త‌ర్వాతి సినిమా ఓకే చేసేందుకు కొంచెం స‌మ‌యం తీసుకున్నాడు. ఎట్ట‌కేల‌కు అత‌డి కొత్త చిత్ర ఖ‌రారైంది.

ప‌లాస 1978 సినిమాతో అరంగేట్రంలోనే మంచి పేరు సంపాదించిన క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సుధీర్ న‌టించ‌బోతున్నాడు. ఈ కాంబినేష‌న్ గురించి కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారం నిజ‌మే అని తేలింది. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్ తాజాగా రిలీజ్ చేశారు. త‌న తొలి సినిమా లాగే ఇది కూడా పీరియ‌డ్ మూవీగానే చేయ‌నున్నాడు క‌రుణ కుమార్. కాన్సెప్ట్ పోస్ట‌ర్లో సోడా బాటిళ్లు, మిగ‌తా సెట‌ప్ చూస్తే ఆ విష‌యం అర్థ‌మ‌వుతోంది.

సుధీర్‌కు ఈ త‌ర‌హా పాత సినిమా కొత్త‌. 70 ఎంఎం ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత‌లు విజ‌య్ చిల్లా, శ‌శి ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. వాళ్లు త‌మ తొలి చిత్రం భ‌లే మంచి రోజును సుధీర్‌తోనే తీశారు. త‌ర్వాత ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర లాంటి సినిమాల‌తో అభిరుచిని చాటుకున్నారు. ఇప్పుడు త‌మ మిత్రుడైన సుధీర్‌తో మ‌రో సినిమాను లైన్లో పెట్టారు. మ‌ణిశ‌ర్మ‌, శ్రీక‌ర్ ప్ర‌సాద్, శ్యామ్ ద‌త్ లాంటి పేరున్న టెక్నీషియ‌న్లు ఈ సినిమాకు ప‌ని చేయ‌నున్నారు.