గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు మంచి కసి మీదున్నారు. గేమ్ ఛేంజర్ పెద్ద దెబ్బ కొట్టడంతో ఎలాగైనా ఆర్సి 16తో బాక్సాఫీస్ బాకీ తీర్చాలని కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టే దర్శకుడు బుచ్చిబాబు ఎప్పటికప్పుడు ఇస్తున్న ఎలివేషన్లు, అప్డేట్లు అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి. నిజానికి ఇవాళ టీజర్ ప్లాన్ చేశారు. కానీ ఫైనల్ మిక్సింగ్, రీ రికార్డింగ్ లో జరిగిన ఆలస్యం వల్ల ఉగాది రోజు దాన్ని విడుదల చేసే అవకాశముంది. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. కానీ ఫ్యాన్స్ కి టైటిల్ రివీల్ పోస్టర్ రూపంలో మంచి కానుక అందించింది ఆర్సి 16 బృందం.
ముందు నుంచి ప్రచారం జరిగినట్టే పెద్ది టైటిల్ అధికారికంగా లాకైపోయింది. నిఖార్సైన మాస్ లుక్ తో చేతిలో చుట్ట కాలుస్తూ రౌద్రం నిండిన కళ్ళతో రామ్ చరణ్ గెటప్ చూస్తుంటే రంగస్థలంని మించి ఇది ఉంటుందనే ఇన్ సైడ్ టాక్ నిజమే అనిపిస్తోంది. రెండో స్టిల్ లో జీన్స్ ప్యాంటు లో రఫ్ లుక్ లో క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం నెక్స్ట్ లెవెలని చెప్పాలి. నిజానికి ఫ్యాన్స్ కోరుకుంటున్నది ఇలాంటిదే. కానీ గేమ్ ఛేంజర్ లో ఐఎఎస్ ఆఫీసర్ గా మరీ ఓవర్ సాఫ్ట్ అయిపోవడం వాళ్లకు కనెక్ట్ కాలేదు. అందులోనూ బ్యాడ్ కంటెంట్ మరింత దెబ్బ కొట్టింది. కానీ పెద్ది విషయంలో అలాంటి అనుమానాలు అక్కర్లేదు. బుచ్చి గురువు సుకుమార్ ని దాటేశాడు.
విడుదల తేదీని ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. టీజర్ లో ఉంటుందని సమాచారం. 2026 మార్చి 26 ఖరారయ్యిందనే లీక్ ఎంతవరకు నిజమనేది తెలిసేది అప్పుడే. నాని ది ప్యారడైజ్ ఉన్నప్పటికీ ఇది మంచి డేట్ అనే ఉద్దేశంతో మైత్రి మేకర్స్ దీని వైపే మొగ్గు చూపినట్టు టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న పెద్దిలో శివరాజ్ కుమార్ పాత్ర కీలకం కానుంది. ఆయనకు సంబంధించిన ఎపిసోడ్స్ ని వేగంగా తీస్తున్నారు. జగపతి బాబు, దివ్యేన్దు లాంటి ఆర్టిస్టులు, ఏఆర్ రెహమాన్ సంగీతం వగైరాలు అంచనాలు పెంచేందుకు దోహదపడుతున్నాయి. మొత్తానికి బర్త్ డే బాయ్ చరణ్ పెద్దితో హైప్ పెంచేశాడు.