శబరిమలలోకి అన్యమతస్థులను అనుమతించే విషయంలో షరతులపై ఎప్పట్నుంచో వివాదాలున్నాయి. క్రిస్టియన్ అయిన ఏసుదాసు శబరిమలకు రావాలనుకున్నపుడు ఆయన్ని అడ్డుకోవడం మీద పెద్ద వివాదమే నడిచింది. చివరికి ఆయన ఆలయానికి వెళ్లారు. అయ్యప్ప మీద అనేక పాటలూ పాడారు. ఐతే ఇటీవల అన్యమతస్థుడైన మరో ప్రముఖుడి కోసం పూజలు చేయడం మీద కాంట్రవర్శీ తప్పలేదు. పూజ జరిగింది మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి కోసం కాగా.. పూజ చేయించింది ఆయన మిత్రుడైన మరో లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్.
ఇటీవల మమ్ముట్టి తీవ్ర అనారోగ్యం పాలైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు క్యాన్సర్ అని కూడా సోషల్ మీడియాలో, మీడియాలో ప్రచారం జరిగింది. అదే సమయంలో మోహన్ లాల్ శబరిమలకు వెళ్లి తన మిత్రుడి కోసం ప్రత్యేకంగా పూజ చేయించారు. ఈ సందర్భంగా మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి అని ప్రస్తావించారు. ఐతే ముస్లిం అయిన మమ్ముట్టి కోసం శబరిమలలో పూజ చేయించడాన్ని కొందరు తప్పుబట్టారు. దీనిపై మోహన్ లాల్ తాజాగా స్పందించారు.
తాను మమ్ముట్టి కోసం పూజ చేయించిన విషయాన్ని ఆలయానికి సంబంధించిన వారే కావాలని లీక్ చేసి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఐతే మమ్ముట్టి కోసం శబరిమలలో పూజ చేయిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఇది తన వ్యక్తిగత విషయమని అన్నారు. మమ్ముట్టి స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని.. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, కాబట్టి అభిమానుల్లో ఆందోళన అనవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న మమ్ముట్టి.. త్వరలో మోహన్ లాల్‌తో కలిసి మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించే చిత్రంలో నటించనున్నాడు. గతంలో ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి పలు చిత్రాల్లో నటించారు. దశాబ్దాలుగా వృత్తి పరంగా పోటీ ఉన్నప్పటికీ ఇద్దరూ ఆప్తమిత్రులుగా కొనసాగుతుండడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates