రవితేజ మిస్సయ్యింది సన్నీకే కరెక్ట్

సన్నిడియోల్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన జాట్ వచ్చే నెల ఏప్రిల్ 10 విడుదల కాబోతోంది. ఇవాళ ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశారు. గతంలో మాస్ మహారాజా రవితేజతో ప్రాజెక్టు అనౌన్స్ చేశాక దాన్ని క్యాన్సిల్ చేసి అదే టీమ్ తో సన్నీని ఒప్పించారు నిర్మాతలు. బడ్జెట్ పెరిగింది. రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. ఆలస్యం లేకుండా షూటింగ్ చకచకా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ చేశారు. అంతకు ముందు రవితేజతో డ్రాపయ్యింది ఏ విషయంలో అనేది కాసేపు పక్కనపెడితే మూడు నిమిషాలకు దగ్గరగా ఉన్న ట్రైలర్ చూసిన తర్వాత ఒక విషయం గమనించవచ్చు.

జాట్ ఊర మాస్ ఎంటర్ టైనర్. అంటే ఇలాంటివి మనం చాలా చూసేశాం. పేద ప్రజలు ఉండే ఒక మత్స్యకార కాలనీని తన గుప్పిట్లో ఉంచుకుంటాడో దుర్మార్గుడు. ఎవరూ నోరు విప్పరు. ఆఖరికి పోలీసులను ఘోరంగా అవమానించినా ఇది తప్పని చెప్పే ధైర్యం ఎవరికి ఉండవు. అప్పుడొస్తాడో వీరుడు. ఒకడు సారీ చెప్పనందుకే నానా భీభత్సం చేసే ఇతను ఆ ఊళ్ళో అడుగుపెట్టాక అరాచకం మొదలవుతుంది. అదెలాగో చెప్పనక్కర్లేదు. ఘాతక్, ఘాయల్, సలాఖే నాటి వింటేజ్ సన్నీ డియోల్ కనిపించేలా దర్శకుడు గోపీచంద్ మలినేని సగటు ఫ్యాన్స్ కోరుకునే వీర మాస్ ఎలిమెంట్స్ తో జాట్ విజువల్స్ నింపేశాడు.

ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లు, రోమాలు నిక్కబొడుచుకుని యాక్షన్, రూపంతోనే భయపెట్టే విలన్లు ఇలా అన్ని ఉన్నాయి. ఒకవేళ ఇదే సబ్జెక్టు రవితేజ చేస్తే రొటీన్ ఫీలింగ్ వచ్చేదేమో. ఎందుకంటే ఈ తరహా కథలు విక్రమార్కుడు లాంటివి గతంలో మాస్ రాజా ఎన్నో చేశాడు. జాట్ వాటిలో ఒకటయ్యేది. ఒకరకంగా చెప్పాలంటే మిస్ కావడం మంచిదేనేమో. ఇదే జాట్ హిందీలో బ్లాక్ బస్టర్ కావొచ్చు. ఎందుకంటే నార్త్ జనాలు మాస్ సినిమాల కరువులో ఉన్నారు. అందులోనూ గదర్ 2 తర్వాత సన్నీ డియోల్ చేసిన సినిమా కావడంతో ఖచ్చితంగా ఎగబడతారు. సో వాళ్ళను కనక మెప్పిస్తే జాట్ రూపంలో జాక్ పాట్ కొట్టినట్టే.

JAAT Trailer | Sunny Deol | Randeep Hooda | Viineet Kumar Siingh | Gopichand Malineni | Thaman S