‘మట్కా’ షాక్ తర్వాత ఎట్టకేలకు..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ పరంగా కొన్నేళ్లుగా బాగా ట్రబుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్-2 లాంటి పెద్ద హిట్లతో ఒకప్పుడు మంచి ఊపులో కనిపించాడు వరుణ్. కానీ గత కొన్నేళ్లలో గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా లాంటి భారీ డిజాస్టర్లు అతడి కెరీర్‌ను వెనక్కి లాగేశాయి. హ్యాట్రిక్ డిజాస్టర్ల తర్వాత తన ఆశలన్నీ గత ఏడాది ‘మట్కా’ మీదే నిలిచాయి. కానీ చిత్రం ముందు సినిమాలను మించి డిజాస్టర్ అయింది. దాదాపు 40 కోట్ల బడ్జెట్ పెడితే.. థియేటర్ల నుంచి ఐదు శాతం కూడా వెనక్కి రాలేదు. వచ్చిన ఆదాయం థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులకే సరిపోవడంతో ‘మట్కా’ జీరో షేర్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాత గట్టి దెబ్బ తిన్నాడు.

ఈ స్థితి నుంచి వరుణ్ కెరీర్ ఎలా ముందుకు వెళ్తుందా అని అందరూ సందేహించారు. ఐతే వరుణ్‌కు అండగా యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థ నిలబడింది. తమ బేనర్‌కు ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ లాంటి హిట్ మూవీ అందించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ హీరోగా చెప్పుకోదగ్గ బడ్జెట్లోనే ఈ సంస్థ సినిమా తీయబోతోంది. ఈ రోజే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ చిత్రానికి ఆల్రెడీ ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ కూడా ఖాయం చేశారు. ఇది హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కనుందట. వరుణ్ సరసన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ భామ రితిక నాయక్ నటించనుంది.

పేరుకు తగ్గట్లే ఈ సినిమాలో కొరియా కీలకంగా కాబోతోంది. హీరోకు ఆ దేశానికి ఉన్న కనెక్షన్ ఏంటన్నది స్పెషల్. ఆ దేశంలోనే చాలా వరకు చిత్రీకరణ కూడా జరపబోతున్నారు. ఆల్రెడీ టీం అంతా వెళ్లి వియత్నాంలో లొకేషన్స్ కూడా చూసి వచ్చింది. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. ఈ ఏడాది చివర్లోనే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాలతో ప్రామిసింగ్‌గా కనిపించిన గాంధీ.. తర్వాత కృష్ణార్జున యుద్ధం, మ్యాస్ట్రో, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ చిత్రాలతో నిరాశపరిచాడు. మరి వరుణ్ మూవీతో అతను ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి.