డిడి అభిమానులు….పట్టుబట్టి సాధించారు

సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఏకంగా ఒక సినిమా ప్రమోషన్ ఎలా ఉండాలో సూచించే స్థాయికి వెళ్ళిపోయింది. మార్చి 28 మ్యాడ్ స్క్వేర్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. నిన్నటి దాకా పబ్లిసిటీ పోస్టర్ల మధ్యలో నితిన్ నార్నెని పెట్టి మిగిలిన ఇద్దరు సంగీత్ శోభన్, రామ్ నితిన్ కుడి ఎడమ వైపు వచ్చేలా డిజైన్ చేశారు. అయితే నితిన్ నార్నె జూనియర్ ఎన్టీఆర్ బావమరిది కాబట్టి ఆ ప్రాధాన్యం కనిపించేలా, ఫస్ట్ పార్ట్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన డిడి అలియాస్ సంగీత్ శోభన్ ని సైడ్ చేశారని ట్విట్టర్ యువత నిరసన ప్రకటించింది. అక్కడితో ఆగకుండా ఎడిటింగ్ చేసి మరీ అతన్ని మధ్యలోకి తెచ్చింది.

ఇది సితార టీమ్ కు చేరిపోయింది. ఇవాళ రిలీజ్ చేసిన పోస్టర్ సంగీత్ శోభన్ మధ్యలోకి వచ్చాడు. దీన్ని బట్టి డిడి ఫాలోయింగ్ యువతలో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తనదైన టైమింగ్ కామెడీని మ్యాడ్ లో అద్భుతంగా పోషించిన డిడి మిగిలిన వాళ్ళను డామినేట్ చేసిన మాట వాస్తవం. నితిన్ నార్నె ప్రాధాన్యం ఉండొచ్చు కానీ తెరమీద ఎక్కువ శాతం నవ్వులు పూయించింది మాత్రం సంగీత్ శోభనే. మ్యాడ్ స్క్వేర్ లోనూ ఈ ముగ్గురు అల్లరి ఓ రేంజ్ లో పేలబోతోందని ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా వన్ లైనర్లు థియేటర్లలో జనాలను కడుపుబ్బా నవ్వించేలా చేస్తాయని అంటున్నారు.

ఒక రోజు ముందే ప్రీమియర్లు వేసే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మ్యాడ్ కు ముందు రోజు మెయిన్ సెంటర్స్ లో స్పెషల్ షోలు వేశారు. అయితే మార్చి 27 ఎల్ 2 ఎంపురాన్, వీరధీర శూర పార్ట్ 2 ఉన్నాయి. రాబిన్ హుడ్ తో క్లాష్ ఉంది కాబట్టి ముందు రోజు రాత్రే షోలు వేస్తే పాజిటివ్ టాక్ పరంగా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. పైగా కోర్ట్ లాంటివి ఈ స్ట్రాటజీ ద్వారా బాగా లాభ పడ్డాయి. నిర్మాత నాగవంశీ దీనికి సంబంధించిన ప్రకటన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి అన్నయ్య సంతోష్ శోభన్ దక్కించుకోలేని పాపులారిటీ సంగీత్ శోభన్ సాధించడం విశేషమే.