నాన్న పోయినా ఏడవని తమన్

సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో తెలిసిందే. కానీ తమన్ చిన్న తనం నుంచి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడో తెలిస్తే మాత్రం తన పట్ల ఆరాధన భావం కలుగుతుంది. స్కూలుకు వెళ్తున్న వయసులో తండ్రి చనిపోతే.. చదువు మానేసి మ్యూజిక్ అసిస్టెంట్‌గా మారి తల్లిని, సోదరిని చూసుకున్న గొప్ప వ్యక్తి తమన్. గతంలోనే ఈ విషయాల గురించి మాట్లాడిన తమన్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి విషయాల గురించి పంచుకున్నాడు.

తనకెంతో ఇష్టమైన తండ్రి చనిపోయినా ఏడవని విషయాన్ని అతను గుర్తు చేసుకున్నాడు.‘‘నాకు 11 ఏళ్లు ఉన్నపుడు నాన్న చనిపోయారు. అప్పుడు చెల్లి రెండో తరగతి చదువుతోంది. నాన్న డెడ్ బాడీని అంబులెన్సులో తీసుకొచ్చినపుడు నా కంట చుక్క నీరు రాలేదు. అందరూ ఏడుస్తున్నారు. నేను మాత్రం ఏడవలేదు. అమ్మను, చెల్లిని ఎలా చూసుకోవాలనే ఆలోచనలోనే ఉండిపోయా. అంత చిన్న వయసులో నాకు అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.

ఆ రోజు మా కుటుంబాన్ని పరామర్శించడానికి డ్రమ్మర్ శివమణి వచ్చారు. ఆయన్ని చూడగానే ఎమోషనల్ అయిపోయాను. మా నాన్న చనిపోయాక వచ్చిన ఎల్ఐసీ డబ్బులు తీసి మా అమ్మ నాకే ఇచ్చేసింది. వాటితో మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కొన్నాను. చదువు మానేసి ఆ వయసు నుంచే మ్యూజిక్ మీద దృష్టిపెట్టా. బాలుగారు, శివమణి గారు.. ఇంకా చాలామంది నాకు సామం చేశారు. అదంతా మా నాన్న మంచితనం వల్లే జరిగిందనుకుంటా. ఇప్పుడు మా అమ్మ వయసు 74 ఏళ్లు. కాలు కిందపెట్టకుండా చూసుకుంటున్నా’’ అని తమన్ తెలిపాడు.