ఈ నెలాఖరు ఉగాది పండక్కు అగ్ర నిర్మాణ సంస్థల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొనబోతోంది. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ పరంగా నువ్వా నేనా అని తలపడుతున్న వైనం ఆసక్తి రేపుతోంది. మార్చి 27 విడుదల కానున్న మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ని ఎస్విసి సంస్థ తరఫున దిల్ రాజు ఏపీ తెలంగాణ హక్కులను కొనేశారు. ఆ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఉదయం ఆరు గంటల నుంచే షోలు పడతాయనే సమాచారం నేపథ్యంలో ప్లానింగ్ గట్టిగానే ఉండనుంది. అదే రోజు విక్రమ్ ‘వీరధీర శూర పార్ట్ 2’ని ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్ కొనుగోలు చేశారు. సీనియర్ కాబట్టి ఆయన పంపిణిని తక్కువంచనా వేయలేం.
మార్చి 28 ‘రాబిన్ హుడ్’ కోసం మైత్రి మూవీ మేకర్స్ భారీ రంగం సిద్ధం చేసి ఉంచింది. ఎడతెరిపి లేని ప్రమోషన్లతో జనం దృష్టిలో నిత్యం ఉండేలా చేస్తున్న వైనం ఓపెనింగ్స్ తేవడం ఖాయం. నితిన్, శ్రీలీల పబ్లిసిటీ కోసం తమ బెస్ట్ ఇస్తున్నారు. బ్లాక్ బస్టర్ కంపెనీగా మైత్రికున్న నెట్ వర్క్, థియేటర్స్ చైన్ సంఖ్యపరంగా రాబిన్ హుడ్ కు చాలా మేలు చేయబోతున్నాయి. స్టార్లు లేని క్యాస్టింగ్ తో వస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ని తక్కువంచనా వేయడానికి లేదు. సితార ప్రొడక్షన్ కాబట్టి ఇటు ప్రమోషన్లు, అటు డిస్ట్రిబ్యూషన్లు రెండింటి విషయంలో నిర్మాత నాగవంశీ తీసుకునే శ్రద్ధ మాములుగా ఉండదు. హైప్ సమంత పెంచేస్తారు.
సో ఉగాదికి జరుగుతున్న నాలుగు సినిమాల క్లాష్ రసవత్తరంగా ఉండబోతోంది. మాములుగా ఉగాదికి వచ్చేది ఒక రోజు సెలవే. కాకపోతే పిల్లల స్కూల్ పరీక్షలు అయిపోయి హాలిడేస్ మొదలవుతాయి కనక థియేటర్ ఆక్యుపెన్సీలు బాగుంటాయి. అందుకే మార్చ్ చివరి వారం నుంచి సీన్ మారిపోతుంది. ఎండలకు తాళలేక థియేటర్లకొచ్చే ప్రేక్షకులు కూడా బాగానే ఉంటారు. ఈ నేపథ్యంలో టాక్ కీలకం కానుంది. ఎవరికి వారు కంటెంట్ పట్ల ధీమాగా ఉన్నారు. దేనికవే విభిన్న జానర్లతో వేర్వేరు వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేసుకున్నాయి. బాగున్నాయనే మాట వినిపించడం ఆలస్యం సినిమా హాళ్లు కళకళలాడుతాయి.