సుకుమార్ కాంబో గురించి ముంబై మసాలా

బాలీవుడ్ మీడియా వర్గాల్లో ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే దర్శకుడు సుకుమార్, హీరో షారుఖ్ ఖాన్ కలయికలో ఒక సినిమా రాబోతోందని. మణిరత్నం, అట్లీ తర్వాత మరో సౌత్ డైరెక్టర్ తో పని చేసేందుకు బాద్షా ఉత్సాహపడుతున్నాడని వాటి సారాంశం. అంతే కాదండోయ్, కథ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతూ, హీరోని కాస్త నెగటివ్ టచ్ ఉండేలా చూపిస్తూ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఏవేవో అల్లేశాయి. ప్రస్తుతం వీళిద్దరికున్న కమిట్ మెంట్లు పూర్తయ్యాక 2027లో ఇది పట్టాలు ఎక్కొచ్చని తేల్చి పారేశారు. ఇంతకన్నా ఘాటైన గాసిప్ మసాలా వేరొకటి ఉండదని చెప్పనక్కర్లేదు.

ఎందుకంటే సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ 17 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇది ఈ ఏడాది చివరిలోగా ప్రారంభం కావొచ్చు. పూర్తి కావడానికి ఎంత లేదన్నా 2026 గడిచిపోతుంది. సో 2027 రిలీజ్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. నిన్న మైత్రి రవిశంకర్ మాటలను బట్టి చూస్తే పుష్ప 3 ది ర్యాంపేజ్ రావడం పక్కానే. ఇది నిజమైన పక్షంలో సుకుమార్ ఇంకో రెండేళ్లు దానికి కేటాయించాల్సి ఉంటుంది. అదే జరిగితే 2029 లేదా ఆపై సంవత్సరం వచ్చేస్తుంది. మరి షారుఖ్ తో చేసే ఛాన్స్ ఎక్కడిది. అసలు సుకుమార్ మనసులో వేరే ఏ ప్రాజెక్టు లేదని, ప్రస్తుతం ఆయన ధ్యాస ఆర్సి 17 మీదే ఉందని సన్నిహితుల మాట.

ఇదే కాదు ఇలాంటి కాంబో కథలు ఈ మధ్య నార్త్ మీడియాలో బాగానే వినిపిస్తున్నాయి. ఎగ్జైట్ చేసేలా ఉండటంతో టాలీవుడ్ మీద ఎక్కువ అవగాహన లేని మూవీ లవర్స్ నిజమే అనుకుంటున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ తర్వాత సుకుమార్ హీరో ఎవరనేది ఇప్పట్లో తేలే ప్రశ్న కాదు. కాకపోతే అధిక శాతం టాలీవుడ్ స్టారే ఉంటాడు తప్పించి ఆయనకేం హిందీ హీరోలతో చేయాలనే ఆతృత లేదట. ఒకరకంగా చెప్పాలంటే రాజమౌళి, త్రివిక్రమ్ తరహాలో మేక్ లోకల్ మార్కెట్ ఇంటర్నేషనల్ సూత్రాన్ని పాటిస్తూ మన హీరోలతోనే గెలిచి చూపించాలనే సూత్రాన్ని ఇకపై కూడా కొనగిస్తారట. సో షారుఖ్ టాక్ ప్రస్తుతానికి పుకారే.