కాదేది కాపీకనర్హం అన్నట్టు సినిమాలకిచ్చే సంగీతంలోనూ ఈ పోకడ ఎప్పటి నుంచో ఉంది. విదేశీ పాటలను వాడుకోవడం, మత్తు వదలరాలో సత్య చెప్పినట్టు నీట్ గా తస్కరించి తమ ఖాతాలో వేసుకోవడం ఎన్నోసార్లు జరిగింది. యూట్యూబ్ ఓపెన్ చేసి ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ ఏమేం కాపీ కొట్టాడని సెర్చ్ చేస్తే ఆధారాలతో సహా కొన్ని వందల వీడియోలు కనిపిస్తాయి. దీనికి లెజెండరీలు సైతం మినహాయింపు కాదు. దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఈ విషయంలో తన స్టాండ్ ఎప్పటి నుంచో బహిర్గతంగా చెబుతూనే వచ్చాడు. తాజాగా ఇచ్చిన ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో కాపీ కొట్టడం అవసరం కన్నా లగ్జరిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను కానీ తన దర్శకులు కానీ ఎప్పుడూ కాపీ కొట్టే దిశగా ప్రోత్సహించలేదని, ఒకవేళ ఒకరిద్దరు అడిగినా కూడా తాను తిరస్కరించి అంతకన్నా మంచి పాటలిచ్చానని చెప్పుకొచ్చాడు. ఇప్పటిదాకా ఏ పాటను రీమిక్స్ చేయకుండా కెరీర్ కొనసాగించానని చెప్పిన దేవి ఎవరైనా తన ఒరిజినల్ వర్క్ గురించి ప్రశంసలు ఇస్తే సంతోషంగా ఉంటుందని అన్నాడు. స్పీడ్ తగ్గించినప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ హిట్ రేషియో అలాగే కొనసాగుతోంది. పుష్ప 2 ది రూల్ పాటలకు వచ్చిన స్పందనే దానికి సాక్ష్యం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోనూ తన పాత్ర ఎంత ఉందో యుట్యూబ్ లో ఓఎస్టి వచ్చాక సంగీత ప్రియులు తెలుసుకున్నారు.
గత నెల తండేల్ సూపర్ హిట్ ఆల్బమ్స్ జాబితాలో చేరిపోయింది. ఇది కూడా వంద కోట్ల క్లబ్బులో చేరిన సినిమానే కావడం గమనార్హం. తన తర్వాత ప్రాజెక్టుల్లో కుబేర జూన్ 20 విడుదల కానుంది. శేఖర్ కమ్ములతో మొదటిసారి పని చేసిన అనుభవంతో పాటు నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లాంటి క్రేజీ క్యాస్టింగ్ అంచనాలు పెంచేస్తోంది. మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ మీద కూడా భారీ హైప్ నెలకొంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కు దేవినే సంగీత దర్శకుడు. కాకపోతే దీనికి కొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉంది. అన్నట్టు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ మ్యూజిక్ బ్యాచిలర్ కూడా దేవినే కావడం ఫైనల్ ట్విస్ట్.