టాలీవుడ్ హీరోల్లో నానికి ఉన్న క్రెడిబిలిటీనే వేరు. ప్రతి హీరోకూ కెరీర్లో ఫ్లాపులు తప్పవు కానీ.. నాని కెరీర్ సక్సెస్ రేట్ మాత్రం వేరే హీరోలతో పోలిస్తే ఎక్కువ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అతను మరీ భరించలేని, చెత్త సినిమాలు చేయడు. తన కెరీర్లో డిజాస్టర్లు అయిన సినిమాల్లో కూడా ఏదో ఒక విశేషం ఉంటుంది. వాచబుల్ అనిపిస్తాయి. అలాగే ఎప్పటికప్పుడు కొత్త కథలు ప్రయత్నిస్తూ, ప్రయోగాలు చేస్తూ, సినిమాకు సినిమాకు వైవిధ్యం చూపిస్తూ సాగిపోతుంటాడు నేచురల్ స్టార్. అందుకే నాని సినిమా వస్తోందంటే థియేటర్లు జనాలతో కళకళలాడుతాయి. ఇవన్నీ ఒకెత్తయితే తాను ప్రొడ్యూస్ చేసే సినిమాల విషయంలోనూ నాని సంపాదించుకున్న క్రెడిబిలిటీనే వేరు అని చెప్పాలి.
అ!, హిట్, హిట్-2.. ఇలా ఇప్పటిదాకా నాని ప్రొడక్షన్లో వచ్చిన ప్రతి సినిమా స్పెషలే. ఇప్పుడు నాని బేనర్ నుంచి వస్తున్న కోర్ట్ సినిమా విషయంలో కూడా ప్రేక్షకుల్లో ఎంత నమ్మకం ఉందో బాక్సాఫీస్ దగ్గర స్పష్టంగా కనిపిస్తోంది. కోర్ట్ మూవీ నచ్చకపోతే తన హిట్-3 మూవీ చూడొద్దని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇటీవల నాని. కొందరు ఇది రిస్కీ స్టేట్మెంట్ అని.. తేడా కొడితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ తప్పదని అన్నారు. కానీ రెండు రోజుల ముందే ప్రిమియర్స్ వేసి మీడియాకు, ప్రేక్షకులకు ఈ సినిమా చూపించాడు నాని. చూసిన వాళ్లందరూ సూపర్ సినిమా అనే అన్నారు. పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది.
పేరున్న హీరో నటించకపోయినా.. క్రేజీ కాన్సెప్ట్ కాకపోయినా.. ఒక థాట్ ప్రొవోకింగ్ మూవీకి బుక్ మై షోలో జరుగుతున్న బుకింగ్స్ చూస్తే ఆశ్చర్యం కలకగమానదు. అనేక షోలు సోల్డ్ ఔట్ అయిపోయాయి. గురువారం కూడా పెయిడ్ ప్రిమియర్స్ పడుతుండగా.. అన్నీ హౌస్ ఫుల్సే. తొలి రోజు మంచి ఓపెనింగ్స్‌తో ఈ సినిమా ఆశ్చర్యపరచబోతోందన్నది స్పష్టం. ఇదంతా నాని అనే వ్యక్తి మీద ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పొచ్చు. కోర్ట్ ఎవ్వరూ ఊహించని నంబర్స్ పెట్టబోతోందని ట్రేడ్ వర్గాలంలటున్నాయి. ఈ సినిమా తర్వాత నిర్మాతగా నాని రేంజ్ ఇంకా పెరుగుతుందనడంలో సందేహం లేదు.