రెండేళ్ల క్రితం సప్తసాగరాలు దాటి సైడ్ ఏ తర్వాత ఏడాది సైడ్ బి రిలీజైనప్పుడు దాని కమర్షియల్ సక్సెస్ పక్కనపెడితే హీరోయిన్ రుక్మిణి వసంత్ నటన ఎందరికో ఫేవరెట్ గా మార్చేసింది. కానీ కథల ఎంపికలో పొరపాట్లు, కాంబోల ట్రాప్ లో పడి ఎంచుకున్న సినిమాలు ఫ్లాపులని ఇచ్చాయి. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడోలో తనే మెయిన్ లీడ్ అంటే ఆశ్చర్యపోతారేమో కానీ రిలీజైన విషయమే చాలా మందికి తెలియనంత డిజాస్టర్ అది. కన్నడ డబ్బింగులు శ్రీమురళి బఘీరా, శివరాజ్ కుమార్ భైరతి రనగల్ హిట్టా ఫ్లాపా పక్కనపెడితే వాటిలో మొక్కుబడి పాత్రలు దక్కి పెర్ఫార్మన్స్ చేసే ఛాన్స్ దొరకలేదు.
అందుకే జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) కి సంతకం చేసే టైంలో వేరే ఏ సినిమాకు కమిట్ అవ్వకూడదన్న కండీషన్ కు ఒప్పుకుంది. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ తన పాత్రను డిజైన్ చేసిన విధానం, తారక్ కాంబినేషన్ చాలా ప్రత్యేకంగా కెరీర్ కి బ్రేక్ ఇచ్చేలా ఉన్నాయట. ఆ కారణంగానే వేరే ఆఫర్లు వదులుకోవాల్సి వచ్చినా సరే టెన్షన్ పడటం లేదట. విజయ్ దేవరకొండ – రవికిరణ్ కోలా కాంబోలో రాబోయే సినిమా ఆఫర్ ఈ కారణంగానే చేయలేదనే టాక్ ఫిలింనగర్ వర్గాల్లో గుప్పుమంటోంది.
గ్లామర్ షో చేయకపోయినా అందం, అభినయం రెండూ ఉన్న రుక్మిణి వసంత్ కు డ్రాగన్ ఎలాంటి బ్రేక్ అవుతుందో చూడాలి. ఎలాగూ ప్రశాంత్ నీల్ చిత్రాల్లో హీరోయిన్ మొక్కుబడిగా డాన్సులు చేయడం కోసం ఉండదు. ఆ మాటకొస్తే ఆయన అసలు డ్యూయెట్లే పెట్టడు. అవసరం లేని కామెడీ ట్రాకులు, ఐటెం సాంగ్స్ ఊసు ఉండదు. కెజిఎఫ్ లో శ్రీనిధి శెట్టికి ఎలాంటి ప్రాధాన్యం దక్కిందో ఇప్పుడీ డ్రాగన్ లో అంతకు మించే రుక్మిణికి ఉంటుందట. ఎలాగూ అక్టోబర్ లేదా నవంబర్ లోగా షూటింగ్ పూర్తి చేసే టార్గెట్ లో ఉన్నారు కాబట్టి 2026 ప్రథమార్ధం నుంచి ఆమె కొత్త సినిమాలు ఎంచక్కా ఒప్పేసుకోవచ్చు.