తెలుగు రియాలిటీ షోలలో సంచలనాలతో పాటు రికార్డులు నమోదు చేసుకున్న వాటిలో బిగ్ బాస్ ది ప్రత్యేక స్థానం. స్టార్ హీరోలు యాంకరింగ్ చేయడం వల్ల ప్రేక్షకులకు తొందరగా రీచయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, నాని చెరొక సీజన్ నడిపించాక నాగార్జున ఏకధాటిగా ఆరు సీజన్లకు యాంకర్ గా వ్యవహరించారు. పార్టిసిపెంట్స్ పరంగా వివాదాలు ఎన్ని ఉన్నప్పటికి హిందీ తరహాలో హద్దులు దాటకుండా చూసుకోవడంలో ఇక్కడి బిగ్ బాస్ సక్సెసయ్యింది. ఈ ఏడాది తొమ్మిదో భాగానికి రంగం సిద్ధం చేయాలి. హాట్ స్టార్ తో జియో చేతులు కలిపాక రానుండటంతో ఈసారి బడ్జెట్ భారీగా పెంచుతారనే అంచానాలున్నాయి.
ఇదిలా ఉండగా 2025 సిరీస్ కి నాగార్జున యాంకరింగ్ చేయడానికి అంత సుముఖంగా లేరనే టాక్ హాట్ టాపిక్ అయ్యింది. ఆయన స్థానంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండను సంప్రదించే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్టు సమాచారం. గత ఏడాది అచ్చం ఇదే తరహాలో నాగ్ నుంచి బాలకృష్ణకు హోస్టింగ్ బాధ్యతలు వెళ్తాయనే ప్రచారం జరిగింది. కానీ బాలయ్య అన్ స్టాపబుల్ షో తప్ప వేరేవాటికి సుముఖత చూపించలేదు. ఇప్పుడు మరి విజయ్ దేవరకొండ గురించి వినిపిస్తున్న వార్త నిజమా కాదా అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. వేసవి తర్వాత కొత్త సిరీస్ ఉండొచ్చని సమాచారం.
ఇది కాసేపు పక్కనపెడితే బిగ్ బాస్ సీజన్లు గడిచే కొద్దీ ఇమేజ్ అంతగా పెరగడం లేదనే కామెంట్లకు సమాధానంగా ఈసారి గేమ్స్ ఆడే విధానాన్ని మారుస్తారని తెలుస్తోంది. పాల్గొనే వాళ్ళు సైతం సెలబ్రిటీలకు తక్కువ సోషల్ మీడియాకు ఎక్కువ తరహాలో ఉండటం వల్ల సామాన్య ప్రేక్షకులకు ఎక్కువ రీచ్ కాలేకపోతున్నారు. మొదట్లోలా సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళను తీసుకొస్తే తప్ప పాపులారిటీ పెంచడం కష్టం. ఆ దిశగా దృష్టి పెడుతున్నారని తెలిసింది. తమిళంలో సుదీర్ఘ కాలం హోస్టింగ్ చేశాక కమల్ హాసన్ తప్పుకుంటే ఆ స్థానంలో విజయ్ సేతుపతి వచ్చి కొనసాగించిన సంగతి తెలిసిందే. మరి నాగ్ ఏం చేస్తారో.