దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా పాటలు పాడుతూ.. డబ్బింగ్ చెబుతూ తెలుగు ప్రజలకు సుపరిచితురాలైన ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పాటలు మాత్రమే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్టుగా.. నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. దేశ విదేశాల్లో అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆమె మూడు వేలకు పైగా సంగీత ప్రదర్శనల్లో పాల్గొన్నారు. తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొనటం ద్వారా సామాన్య ప్రజలకు మరింత దగ్గరయ్యారు.
మహా శివరాత్రి రోజున సంగారెడ్డిలో నిర్వహించిన సంగీత విభావరిలో పాల్గొని పాటలు పాడిన ఆమె హైదరాబాద్ లోని నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాస్ లో నివాసం ఉంటున్నారు. గడిచిన రెండురోజులుగా ఆమె ఇంటి తలుపులు తెరవకపోవటంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అసోసియేషన్ కు సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం సాయంత్రం వేళలో ఆమెకు ఫోన్ చేస్తే స్పందించలేదు. చెన్నైకి చెందిన ఆమె భర్త ప్రసాద్ కుడా మంగళవారం ఉదయం ఫోన్చేసినా స్పందించలేదు.
ఈ నేపథ్యంలో కేపీహెచ్ బీ పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి ప్రధాన ద్వారం నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. తలుపు బలంగా ఉండటంతో.. దాన్ని తీయటం సాధ్యం కాలేదు. దీంతో.. ఇంటి వెనుక వంట గది వద్ద తలుపుల్ని బద్ధలు కొట్టి ఇంటి లోపలకు వెళ్లారు. అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో మంచం మీద పడి ఉన్నారు. ఆమె పెద్ద ఎత్తున నిద్ర మాత్రలు మింగినట్లుగా గుర్తించారు.
దీంతో ఆమెను నిజాంపేటలోని హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి కారణం బయటకురాలేదు. ఆమె భర్త ప్రసాద్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన్ను పోలీసులు ఇంటికి తీసుకెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కల్పనకు గతంలో వివాహమైంది. 2010లో భర్తతో విడాకులు తీసుకున్నారు. అప్పుడున్న సమస్యల నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లుగా ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఆమె ఉండటం షాకింగ్ గా మారింది. ఇదిలా ఉండగా.. మంగళవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత సింగర్ కల్పన వ్యవహారం గురించి తెలుసుకున్న సింగర్లు సునీత.. గీతామాధురి.. శ్రీక్రిష్ణ.. కారుణ్య తదితరులు ఆమెను చూసేందుకు ఆసుపత్రికి వచ్చారు.