అడివి శేష్ దర్శనం ఇంకెప్పుడు

కంటెంట్ హీరోగా పేరు తెచ్చుకున్న అడివి శేష్ ని తెరమీద చూసి 27 నెలలు గడిచిపోయాయి. హిట్ 3 ది థర్డ్ కేస్ తర్వాత మళ్ళీ ప్రేక్షకులను పలకరించలేదు. ఇదంతా డిసెంబర్ 2022 నాటి ముచ్చట. నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తున్న శేష్ ఒకేసారి రెండు సినిమాలు సెట్స్ మీద పెట్టాడు కానీ ఏది ఎప్పుడు రిలీజవుతుందో క్లారిటీ లేక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. హీరోయిన్ శృతి హాసన్ ని మార్చి మృణాల్ ఠాకూర్ ని తీసుకోవడం వల్ల డెకాయిట్ ఆలస్యమవుతోంది. క్యాస్టింగ్ సమస్యతో పాటు బడ్జెట్ చిక్కులు డిలే అయ్యేందుకు కారణంగా వినిపిస్తోంది. ఇంకా విడుదల తేదీ ఖరారు కాలేదు.

భారీ అంచనాలు నెలకొన్న జి2 అలియాస్ గూఢచారి 2 సైతం వేగంగా సాగడం లేదు. తెలుగు హిందీ భాషల్లో సమాంతరంగా రూపొందిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మీద బిజినెస్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది. కొత్త ఏడాదిలో మార్చి వచ్చేసింది. అప్పుడప్పుడు అప్డేట్స్ ఇవ్వడం తప్ప అడివి శేష్ నిర్మాతల నుంచి సాలిడ్ ప్రమోషన్లు కనిపించడం లేదు. సన్నిహితులు మాత్రం ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరంలోనే వస్తాయని అంటున్నారు. వేసవి దాకా స్లాట్లు ఖాళీ లేవు. దసరా, దీపావళిను లాక్ చేసుకునే పనిలో ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. మరి డెకాయిట్ ఏదో ఒకటి ముందు ఫిక్స్ చేసుకోవడం అవసరం.

మంచి సినిమాలే చేయాలనే నిర్ణయం సరైందే కానీ అడివి శేష్ లాంటి వాళ్ళు మరీ రెండేళ్ల గ్యాప్ తీసుకోవడం సరికాదు. మార్కెట్ ని కాపాడుకోవాలనుకోవడం మంచిదే. కానీ అలాని మరీ బండి ఇంత నెమ్మదిగా నడిపినా ఇబ్బందే. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే నాని లాగా టయర్ 2 నుంచి స్టార్ లీగ్ లోకి వెళ్ళడానికి అడివి శేష్ కు బోలెడంత ఛాన్స్ ఉంది. కాకపోతే దాన్ని సరిగా వాడుకోవడం తెలియాలి. సంవత్సరానికి ఒక రిలీజ్ ఉండేలా చూసుకుంటే కామన్ ఆడియన్స్ తో అనుసంధానం కొనసాగుతుంది. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యమని భావించడం మంచిదే కానీ ఆలస్యం అమృతం విషం అనే సామెత కూడా అవసరమే.