సంక్రాంతికి హౌస్ ఫుల్ బోర్డే..

ఆలూ లేదు చూలూ లేదు.. అన్నట్లే ఉంది సంక్రాంతి బెర్తుల కోసం పోటీ చూస్తుంటే. థియేటర్లు తెరుచుకోవడానికి ఈ నెలలో అనుమతులైతే ఇచ్చారు కానీ.. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే పున:ప్రారంభం అయ్యాయి. అవి కూడా కొన్ని మల్టీప్లెక్స్ ఛైన్స్ మాత్రమే. అవి కూడా నామమాత్రంగా నడుస్తున్నాయి. మిగతా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో.. మామూలుగా నడుస్తాయో తెలయట్లేదు.

ఏదైనా సరే.. కరోనా ప్రభావం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం మీదే ఆధారపడి ఉంది. ఐతే థియేటర్ల సంగతి ఎటూ తేలకుండానే టాలీవుడ్లో సంక్రాంతి పందేలు మాత్రం జోరుగా సాగిపోతున్నాయి. వరుసబెట్టి సంక్రాంతి రిలీజ్ అంటూ సినిమాలను ప్రకటించేస్తున్నారు. ఆ మధ్య నితిన్ సినిమా ‘రంగ్ దె’ను సంక్రాంతి రేసులో నిలబెడుతున్నట్లు టీజర్లో ప్రకటించారు.

ఇక రెండు రోజుల కిందటే రానా దగ్గుబాటి సినిమా ‘అరణ్య’ను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు దసరా సందర్భంగా ఒకటికి రెండు సినిమాలు సంక్రాంతి విడుదలను ప్రకటించుకున్నాయి. అందులో ఒకటి రవితేజ సినిమా ‘క్రాక్’ కాగా.. ఇంకోటి రామ్ మూవీ ‘రెడ్’. ‘క్రాక్’ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ‘రెడ్’ ఎప్పుడో ఫస్ట్ కాపీతో రెడీ అయిపోయింది. ‘అరణ్య’ సైతం ఎప్పుడో పూర్తయింది. ‘రంగ్ దె’ చివరి దశలో ఉంది.

ఒకే సీజన్లో నాలుగు సినిమాలంటే ఇక హౌస్ ఫుల్ బోర్డు పెట్టేయాల్సిందే. వేరే సినిమాలకు అవకాశం లేనట్లే. వీటిని సంక్రాంతికి సిద్ధం చేయడం కష్టమేమీ కాదు కానీ.. అప్పటికి థియేటర్లు తెరుచుకుని మామూలుగా నడుస్తాయా లేదా అన్నదే సందేహంగా ఉంది. మరోవైపు కన్నడ సినిమా ‘కేజీఎఫ్’ను సైతం సంక్రాంతికే రిలీజ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. సంక్రాంతి కంటే ముందే థియేటర్లు 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో నడిచి జనాలు ఒకప్పట్లా సినిమాలు చూడ్డానికి వస్తేనే ఈ సినిమాలన్నీ సంక్రాంతి రేసులో ఉంటాయన్నది స్పష్టం.