తాజాగా విడుదలైన మజాకాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాని మాట వాస్తవమే కానీ నిర్మాతలు ఆశించినట్టు పికప్ కూడా వేగంగా లేకపోవడం కొంత టెన్షన్ కలిగిస్తోంది. తండేల్ తర్వాత బాక్సాఫీస్ వద్ద మరో హిట్టుగా ఇది నిలుస్తుందన్న బయ్యర్ల నమ్మకం ఏ మేరకు నిలబడుతుందో వీకెండ్ పూర్తయ్యాక సోమవారం క్లారిటీ వస్తుంది. మిక్స్డ్ టాక్ ప్రభావమైతే కాదనలేని వాస్తవం. ఒకవేళ అనూహ్యంగా ఏమైనా పుంజుకుంటే మాత్రం ఇంకో రెండు వారాల స్పేస్ దొరుకుతుంది కాబట్టి బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా పెట్టుకోవచ్చు. టీమ్ అదే నమ్మకంతో ఉంది. ఇప్పుడు చిరంజీవి ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం.
మజాకా లైన్ తొలుత చిరంజీవికి అనుకున్నదనేది ఓపెన్ సీక్రెట్. అందరికీ తెలిసిందే. చూచాయగా రచయిత, దర్శకుడు దాన్ని ఒప్పుకున్నారు కూడా. సన్నిహిత వర్గాల కథనం ప్రకారం భోళా శంకర్ రిలీజ్ కు ముందు కల్యాణ కృష్ణ దర్శకత్వంలో సుస్మిత కొణిదెల, పీపుల్స్ మీడియా భాగస్వాములుగా ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. దానికి అనుకున్న కథ మజాకానే. కాకపోతే పాయింట్ మారకుండా ట్రీట్ మెంట్ కొంచెం వేరుగా ఉండేది. కానీ భోళా శంకర్ కు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని సీరియస్ గా తీసుకున్న మెగాస్టార్ మళ్ళీ కామెడీ చేయడం రిస్కనిపించి ఫైనల్ నెరేషన్ అయ్యాక వద్దనుకున్నారట.
ఇప్పుడా ముందుచూపే మేలు చేసిందని చెప్పాలి. రావు రమేష్ కాబట్టి పాజిటివ్ అయినా నెగటివ్ అయినా లేట్ వయసులో పెళ్లి చేసుకునే క్యారెక్టర్ మీద ఎక్కువ కామెంట్స్ రాలేదు. కానీ చిరంజీవి ఇమేజ్ కి అలా జరగలేదు. సోషల్ మీడియా జనాలు పోస్ట్ మార్టం చేస్తారు. కామన్ ఆడియన్స్ ఏ మాత్రం రిసీవ్ చేసుకోకపోయినా మరో ఫ్లాప్ దక్కేది. రావు రమేష్ – సందీప్ కిషన్ కెమిస్ట్రీ గురించి ఎలాంటి కంప్లయింట్స్ రాలేదు కానీ అదే చిరు – సిద్దు జొన్నలగడ్డ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ మిస్ కావడమే మంచిదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. లేదూ ఇంకా బాగా వచ్చేదనే మాటని కూడా తీసిపారేయలేం.