ఫిబ్రవరి నెల అయిపోయింది. మార్చిలోకి అడుగుపెట్టబోతున్నాం. ముందు నుంచి చెబుతూ వచ్చిన ప్రకారమైతే హరిహర వీరమల్లు విడుదలకు ఇంకో 27 రోజులు మాత్రమే ఉంది. ఇంకొంత షూట్ బాలన్స్ ఉందని టాక్. పవన్ కళ్యాణ్ మరో నాలుగైదు రోజులు డేట్స్ ఇస్తే అయిపోతుందట. కానీ ఆరోగ్యం, అసెంబ్లీ సమావేశాలు తదితర కారణాలు స్పీడ్ బ్రేకర్స్ లా మారాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం వీరమల్లు రావడం అనుమానంగానే ఉంది. అందుకే మార్చ్ 28, 29 రావాలని ఫిక్సయిపోయిన నితిన్ రాబిన్ హుడ్, సితార సంస్థ మ్యాడ్ స్క్వేర్ రెండూ ప్రమోషన్ల వేగాన్ని అమాంతం పెంచే పనిలో పడ్డాయి.
ఒకవేళ వీరమల్లు వాయిదా తప్పని పక్షంలో ఏప్రిల్ 11, 18 రెండు తేదీలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అనుష్క ఘాటీ కనక మూడో వారం నుంచి తప్పుకుంటే ఆ డేట్ సానుకూలంగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి యువి క్రియేషన్స్, దర్శకుడు క్రిష్ పోస్ట్ పోన్ గురించి ఎలాంటి సూచనలు ఇవ్వడం లేదు. నిర్ణయం మార్పు లేదనే తరహాలోనే సంకేతం ఇస్తున్నారు. ఒకవేళ పదకొండు అనుకుంటే కేవలం రెండు వారాల సమయం సరిపోతుందా అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటిదాకా టీజర్, రెండు లిరికల్ వీడియోస్ మాత్రమే వచ్చాయి. అసలైన ట్రైలర్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.
సో ఏదో ఒకటి నిర్మాత ఏఎం రత్నం టీమ్ నుంచి అఫీషియల్ నోట్ రావడం అవసరం. ఒకవేళ మార్చి 28 అనుకుంటే పబ్లిసిటీ ప్లాన్ మార్చుకోవాలి. లేదంటే మారిన సంగతిని ప్రకటించాలి. హైప్ విషయంలో ఇంకా వెనుకబడే ఉన్న హరిహర వీరమల్లు ఓపెనింగ్స్ పరంగా ఫ్యాన్స్, జనసేన వర్గాల నుంచి మద్దతు పుష్కలంగా ఉంటుంది కానీ సగటు ప్రేక్షకులు రావాలంటే మాత్రం అంచనాలు పెంచేయాలి. కీరవాణి పాటలు బాగానే ఉన్నా ఆర్ఆర్ఆర్ స్థాయిలో లేవనే కామెంట్స్ లేకపోలేదు. నిధి అగర్వాల్, బాబీ డియోల్, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ హిస్టారికల్ డ్రామాని అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు.