పూజా హెగ్డేను అలా చూసి తట్టుకోగలరా?

పూజా హెగ్డే హీరోయిన్‌గా అరంగేట్రం చేసి దశాబ్దం దాటింది. కానీ ఇన్నేళ్లు గడిచినా ఆమెను ఒక గ్లామర్ హీరోయిన్‌గానే చూస్తున్నారు. ఆమె నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసింది తక్కువ. ‘అరవింద సమేత’ లాంటి కొన్ని చిత్రాల్లో మాత్రమే కొంత నటనకు ప్రాధాన్యం లభించింది. అలాంటి పాత్రల్లోనూ ఆమె గ్లామరే హైలైట్ అయింది తప్ప.. నటన గురించి పెద్దగా మాట్లాడుకోలేదు. అందం కోణంలో తప్ప నటన కోసం చూడని కొద్దిమంది హీరోయిన్లలో పూజా ఒకరని చెప్పాలి. అలాంటి హీరోయిన్లను డీగ్లామరస్, పెయిన్ ఫుల్ క్యారెక్టర్లలో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడరు కూడా.

గతంలో కాజల్ అగర్వాల్ కూడా ఈ కోవకే చెందేది. ఐతే పూజా కెరీర్లో తొలిసారిగా డీగ్లామరస్ రోల్ చేయబోతోందని.. ఆమెను ఒక షాకింగ్ క్యారెక్టర్లో రాఘవ లారెన్స్ చూపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కాంఛన సిరీస్‌లో నాలుగో సినిమా తీయడానికి రాఘవ లారెన్స్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డేను కథానాయికగా ఎంచుకున్నాడు. ఆమె ఈ సినిమాలో చెవిటి-మూగ అమ్మాయిగా కనిపించబోతోందనే వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

పూజా లాంటి గ్లామర్ హీరోయిన్ ఇలాంటి పాత్ర చేయడం ఏంటి అని తన ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇంతకుముందు ‘గంగ’ (కాంఛన-3)లో సినిమాలో నిత్యా మీనన్‌ను దివ్యాంగురాలిగా చూపిస్తే బాగానే కుదిరింది. బేసిగ్గా నిత్య పెర్ఫామర్ కావడం వల్ల ఆ పాత్ర పండింది. కానీ పూజాను చెవిటి-మూగ అమ్మాయిగా చూపిస్తే తన ఫ్యాన్స్ తట్టుకోగలరా అన్నది సందేహం. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో చేసి తామేంటో నిరూపించుకోవాలని అందరు హీరోయిన్లకూ ఉంటుంది కానీ.. పూజా మాత్రం ఇలాంటి పాత్రకు మిస్ ఫిట్ ఏమో అనే సందేహాలు కలుగుతున్నాయి.