నవీన్ పోలిశెట్టి అంత రిస్క్ చేస్తాడా

ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎంత గ్యాప్ ఏర్పడుతున్నా కథలు కాంబోలు ఎంపిక చేసుకునే విషయంలో నవీన్ పోలిశెట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. 2019లో ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయతో సూపర్ హిట్ కొట్టాక కేవలం రెండు సినిమాలు జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చేశాడు. అవీ ఘనవిజయం సాధించాయి. అంటే ఆరేళ్ళ కాలంలో కేవలం మూడుసార్లు మాత్రమే టాలీవుడ్ తెరపై కనిపించాడు. మధ్యలో అమెరికాలో జరిగిన యాక్సిడెంట్ వల్ల కొంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ త్వరగానే కోలుకున్నాడు. ప్రస్తుతం అనగనగా ఒక రాజు మాత్రమే సెట్స్ మీద ఉంచాడు. షూటింగ్ వేగంగా జరుగుతోంది.

ఇదిలా ఉండగా ఇటీవలే లెజెండరీ దర్శకులు మణిరత్నం మన నవీన్ పోలిశెట్టికి ఒక లైన్ చెప్పారని ఫిలిం నగర్ టాక్. పొన్నియిన్ సెల్వన్, తగ్ లైఫ్ లాంటి భారీ ప్యాన్ ఇండియా మూవీస్ తర్వాత ఒక కూల్ రొమాంటిక్ లవ్ స్టోరీ చేసే ఆలోచనలో మణిరత్నం ఉన్నారు. సఖి, మౌనరాగం, ఓకే బంగారం టైపు లో తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేసుకున్నారు. ముందు కొత్త నటీనటులతో తీస్తారని టాక్ వచ్చింది కానీ తర్వాత మనసు మార్చుకుని స్టార్ క్యాస్టింగ్ వైపే మొగ్గు చూపారట. అందులో భాగంగానే నవీన్ పోలిశెట్టిని సంప్రదించారని అంటున్నారు. నిజమో కాదో ఎవరో ఒకరు ఓపెనయ్యేదాకా వేచి చూడాలి.

ఇక రిస్క్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే మణిరత్నం మునుపటిలా ఫామ్ లో లేరు. పొన్నియిన్ సెల్వన్ తమిళనాడులో ఎంత బాగా ఆడినా బయట రాష్ట్రాల్లో ఫ్లాపే. ట్రోలింగ్ చేసిన వాళ్ళు లేకపోలేదు. అంతకు ముందు ఇచ్చినవి మాములు డిజాస్టర్లు కాదు. టాలీవుడ్ హీరోలలో మణిరత్నం చేసింది ఒక్క గీతాంజలి మాత్రమే. అది కూడా ఎప్పుడో ముప్పై ఏడేళ్ల క్రితం. అప్పటి వింటేజ్ మణిని ఇప్పుడు ఆశించలేంగా. అలాంటప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్న నవీన్ పోలిశెట్టి పెద్దాయనకు ఓకే చెబుతాడా అనేది సస్పెన్సే. తగ్ లైఫ్ రిలీజయ్యాక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటికొచ్చే ఛాన్స్ ఉంది.