గత కొన్నేళ్లలో దక్షిణాది సినీ పరిశ్రమలో విడాకుల వార్తలు పెరిగిపోయాయి. నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య, జయం రవి-ఆర్తి, జీవీ ప్రకాష్ కుమార్-సైంధవి.. ఇలా దక్షిణాది ఇండస్ట్రీలో విడిపోయిన జంటలు చాలానే ఉన్నాయి. వీరిలో జీవీ-సైంధవి జంట విడాకులకు తమిళ హీరోయిన్ దివ్యభారతి కారణమంటూ గత ఏడాది సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగింది. .జస్ట్ రూమర్లు రావడం వరకు మామూలే కానీ.. ఈ విషయంలో దివ్యభారతిని తిడుతూ చాలామంది ఆమెకు మెసేజ్‌లు పంపారట. చాలామంది మహిళలే తనను తిట్టినట్లు దివ్యభారతి వెల్లడించింది.
జీవీ-దివ్యభారతి గతంలో ‘బ్యాచిలర్’ అనే సినిమాలో కలిసి నటించారు. అందులో వాళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. ఇప్పుడు జీవీ-దివ్య కలిసి నటించిన ‘కింగ్ స్టన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవీ, దివ్యభారతి.. ఈ విషయమై మాట్లాడారు. తాను, దివ్యభారతి మంచి స్నేహితులమని, అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని జీవీ ప్రకాష్ స్పష్టం చేశాడు. సినిమా సెట్స్ దాటి బయట తాము కలవనే కలవమని అతను చెప్పాడు. తనకు, సైంధవికి విడాకులు కావడానికి తనే కారణమని సోషల్ మీడియాలో నిందించడం అన్యాయమని అతనన్నాడు.
ఇక దివ్యభారతి మాట్లాడుతూ.. ‘‘నేను, జీవీ కలిసి చేసిన ‘బ్యాచిలర్’లో మా ఇద్దరి కెమిస్ట్రీకి మంచి స్పందన వచ్చింది. కానీ జీవీ, సైంధవి విడాకుల గురించి ప్రకటించినపుడు అందరూ నన్ను నిందించడం మొదలుపెట్టారు. దారుణంగా తిడుతూ మెసేస్‌లు పెట్టేవారు. విడాకుల తర్వాత కూడా జీవీ, సైంధవి కలిసి మ్యూజికల్ కన్సర్ట్ చేస్తే చాలా సంతోషించాను. ఇక ఆ మెసేజ్‌లు ఆగిపోతాయనుకున్నా. కానీ తర్వాత కూడా అవి ఆగలేదు. ఇంకా పెరిగాయి.
మహిళలే చాలామంది నన్ను తిట్టేవాళ్లు. కొన్ని మెసేజ్‌లను జీవీకి ఫార్వర్డ్ చేసేదాన్ని. కానీ ఇవేవీ పట్టించుకోకుండా కెరీర్ మీద దృష్టిపెట్టమని జీవీ చెప్పేవాడు’’ అని చెప్పింది. పని విషయంలో తాను, సైంధవి ఎంతో క్రమశిక్షణతో ఉంటామని, అందుకే విడిపోయాక కూడా కలిసి కన్సర్ట్ చేసి తాము ప్రొఫెషనల్ అని చాటామని జీవి తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates