అభిమానులు హెచ్చుతగ్గుల్లో ఎంత ఊహించుకున్నా వాళ్ళు హరిహర వీరమల్లుని తక్కువంచనా వేస్తున్న మాట వాస్తవం. ఓజి నామస్మరణతో దాని మైకంలోనే ఉన్నారు కానీ నిజానికి చావాని మించిన చారిత్రాత్మక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నారనేది థియేటర్లోనే తెలుసుకుంటారని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం వీరమల్లు పాత్ర సర్వాయి పాపన్న కథ ఆధారంగా రాసుకున్నారట. ఈ మహాయోధుడి పూర్తి పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. 1650లో జన్మించి శైవ మతస్థుడే అయినప్పటికీ కులాలు, మతాలకతీతంగా ఒక పెద్ద సైన్యం తయారు చేసుకున్నాడు.
తురుష్క్ సైనికులు పన్నులు వసూలు చేసే క్రమంలో కల్లు గీసే వ్యాపారం చేస్తున్న పాపన్నతో ఒక స్నేహితుడి వల్ల తగవు పెట్టుకుంటారు. దీంతో ఉగ్రరూపం చెందిన పాపన్న వాళ్ళ తల నరకడమే కాక ఊరువాడా ఏకం చేసి మూడు వేల మందితో ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసుకుంటాడు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీకి సమాంతరంగా మొఘల్ సామ్రాజ్య ఒంటెత్తు పోకడలపై యుద్ధం చేసి గెలిచిన ఖ్యాతి ఈయన పేరు మీద ఉంది. 1700 సంవత్సర సమయంలో గోల్కొండ దాకా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇరవై దాకా కోటలను గెలుచుకున్న పాపన్న సాహసాలకు నిజాం రాజులు బెంబేలెత్తిపోయారు.
ఇలా అప్రతిహతంగా జరిగిపోతున్న జైత్రయాత్రలో చావాలో శంభాజీకి జరిగినట్టే పాపన్నకు ద్రోహం జరిగి పట్టుబడతాడు. తర్వాత జరిగేది ఊహకందనంత గొప్పగా ఉంటుందట. ఇక్కడ చెప్పింది కొన్ని విషయాలే కానీ హరిహర వీరమల్లు కోసం కేవలం పాపన్నకు సంబంధించిన ముఖ్యమైన నేపధ్యాన్ని మాత్రమే తీసుకుని చాలా మార్పులు చేశారని సమాచారం. అధికారికంగా ఇది సర్వాయి పాపన్న కథని టీమ్ ప్రకటించనప్పటికీ అబ్బురపరిచే విజువల్స్ తో పాటు వావ్ అనిపించే ఎపిసోడ్స్ చాలానే ఉంటాయట. బాహుబలి తరహాలో మొదటి భాగాన్ని మించి సీక్వెల్ కోసం ఎదురు చూసే స్థాయిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates