సాయిపల్లవి సంతోషం అంతకు మించి

ఎన్ని ఆఫర్లు వచ్చినా కథ నచ్చి పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉంటే తప్ప ఒప్పుకోని సాయిపల్లవికి తాజాగా తండేల్ సక్సెస్ మాములు కిక్ ఇచ్చినట్టు లేదు. ఎన్నడూ లేనిది నిన్న శ్రీకాకుళంలో జరిగిన సక్సెస్ మీట్ లో స్టేజి మీద నాగచైతన్య, అల్లు అరవింద్ తో కలిసి హుషారుగా స్టెప్పులు వేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

మాములుగా మొహమాటానికి ఎవరైనా కాలు కదపడం సహజం. కానీ బుజ్జితల్లి అలా కాదు. నిజమైన ఆనందం తొణికిసలాడుతుండగా తన్మయత్వంతో చేస్తున్న నృత్యం స్పష్టంగా నిజమేంటో చెప్పేస్తోంది. ఎంతో సంతోషం ఉంటే తప్ప బహిరంగ వేదిక మీద ఇలా నాట్యం చేయలేరు.

తక్కువ గ్యాప్ లో సాయిపల్లవికి రెండు మర్చిపోలేని హిట్లు పడ్డాయి. అమరన్ గత ఆగస్ట్ లో నమోదు చేసిన సంచలనం ఇంకా గుర్తే. తాజాగా తండేల్ కూడా దాని సరసన చేరింది. మరీ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కావడం లేదు కానీ టీమ్ కోరుకున్న వంద కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెట్టడంతో పాటు కలెక్షన్లు స్టడీగా ఉండటంతో ప్రమోషన్లు ఆపకుండా చేస్తున్నారు.

కొత్త రిలీజుల ప్రభావం అంతంతమాత్రమే అనిపించడం మరో వీకెండ్ ని తండేల్ కి అనుకూలంగా మార్చబోతోంది. అందుకే సాయిపల్లవి సైతం తనకు డేట్ ఖాళీ ఉంటే చాలు గీతా ఆర్ట్స్ అడిగిన ప్రతి ప్రమోషన్ ప్లాన్ లో భాగమయ్యేందుకు సిద్ధంగా ఉంది.

ఇటు నాగచైతన్య పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. వరస ఫ్లాపులతో కుదేలైన టైంలో తండేల్ ఎక్కడలేని ఎనర్జీ తీసుకొచ్చింది. ఏడాదిన్నర దీని కోసమే ఖర్చు పెట్టిన సమయానికి న్యాయం చేకూర్చింది. ఇంకా భారీ స్పందన ఆశించినప్పటికీ ఈ కంటెంట్ అన్ని వర్గాలకు యునానిమస్ గా కనెక్ట్ అయ్యేది కాకపోవడంతో వసూళ్ల పరంగా కొన్ని పరిమితులు వస్తున్నాయి.

అయినా సరే మజిలీ. లవ్ స్టోరీలను అవలీలగా దాటేస్తున్న తండేల్ కనీసం ఇంకో వారం పది రోజులు స్ట్రాంగ్ గా ఉండబోతోంది. కాకపోతే వీక్ డేస్ లో ఆక్యుపెన్సీలను నిలబెట్టుకోవడం కీలకం. అది చేయగలిగితే మరింత పెద్ద నెంబర్ వస్తుంది.