రమేష్ బాబు కామెంట్ – బండ్ల గణేష్ కౌంటర్

ఇవాళ సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపింది. పధ్నాలుగు సంవత్సరాలు పరిశ్రమకు దూరంగా ఉన్న ప్రొడ్యూసర్ ఇంత హఠాత్తుగా మీడియా ముందుకు రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమయ్యింది.

గతంలో తను పడిన సాధక బాధలు, భవిష్యత్ ప్రణాళికలు వివరించడానికి వచ్చిన రమేష్ బాబు ఖలేజా, కొమరం పులి వల్ల 100 కోట్లు నష్టపోయానని, అలాంటి పరిస్థితిలో హీరోలు కనీసం అయ్యో పాపం అనలేదని వాపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. అంటే నేరుగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబునే నిందించిన అర్థం రావడంతో ఇదో హాట్ టాపిక్ అయ్యింది.

దీనికి మరో నిర్మాత బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. కొమరం పులి టైంలో పవన్ కళ్యాణ్ వేరొకరికి డేట్లు ఇవ్వకుండా కేవలం మీ కోసమే కొన్ని వందల కాల్ షీట్లు వృథా చేసుకున్నారని, దానికి ప్రత్యక్ష సాక్షిని నేనేనంటూ బాంబు పేల్చడంతో ఒక్కసారిగా కథ మలుపు తిరిగినట్టు అయ్యింది.

నిజానికి ఆ రెండు సినిమాలు జాప్యం కావడం వెనుక చాలా కారణాలున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా మహేష్, పవన్ బాధ్యులు కాదని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాణ సంస్థ వైపు నుంచే ఆలస్యం జరిగిందని చెప్పేవారు. నిజా నిజాలు ఆధారాలతో ఇప్పుడు బయటికి రావడం కష్టం కానీ మొత్తనికో చర్చ మొదలైంది.

ఇన్నేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు హఠాత్తుగా తెరమీదకు రావడం వెనుక ఉద్దేశం కేసుల నుంచి విముక్తి పొందానని చెప్పడమే అయినా సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి విషయం సున్నితంగా మారిపోయి శల్యపరీక్షకు గురవుతున్న ట్రెండ్ లో కొత్తవాళ్ళైనా పాతవాళ్ళైనా ఆచితూచి మాట్లాడ్డం అవసరం.

లేదంటే ఇలాంటి కౌంటర్లు వస్తుంటాయి. పవన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న బండ్ల గణేష్ అంత బలంగా చెప్పారంటే ఏదో ఆషామాషీగా అయితే అయ్యుండదు. దర్శకుడు ఎస్జె సూర్య స్పందించే ఛాన్స్ లేకపోలేదు. వివాదాలకు దూరంగా ఉండే త్రివిక్రమ్, మహేష్ నుంచి ఏమైనా చెప్పడం డౌటే. ఏదైతేనేం ట్విట్టర్ కో స్టఫ్ అయితే దొరికింది.