వింటేజ్ రవితేజని బయటికి తీశారు

ధమాకా తర్వాత రవితేజ రియల్ మాస్ మళ్ళీ తెరమీద కనిపించలేదు. వాల్తేరు వీరయ్య సంతృప్తి పరిచింది కానీ అది చిరంజీవి సినిమా అందులోనూ ఎక్స్ టెండ్ చేసిన క్యామియో కావడంతో మాస్ మహారాజా అభిమానులు సోలో హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, ఖిలాడీ, మిస్టర్ బచ్చన్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి.

అందుకే ఈసారి వాళ్ళ ఆశలన్నీ మాస్ జాతర మీద ఉన్నాయి. హిట్ చిత్రాలకు రచయితగా పని చేసిన భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్ టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తోంది. శ్రీలీల హీరోయిన్ కావడంతో కాంబో పరంగా అంచనాలు పెరిగాయి.

ఇవాళ రవితేజ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. చాలా గ్యాప్ తర్వాత వింటేజ్ రవన్న కనిపించాడని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. విక్రమార్కుడు వైబ్స్ గుర్తుకు వచ్చేలా పోలీస్ యూనిఫామ్ లో ఒక లుక్, మాములు క్యాజువల్ దుస్తుల్లో మరో గెటప్ తో టైటిల్ కు తగ్గట్టే ఊర మాస్ అనిపిస్తున్నాడు.

డ్యూయల్ రోల్ కాకపోయినా రెండు షేడ్స్ ఉంటాయనే క్లూ అయితే ఇచ్చారు. ముఖ్యంగా కొనలు తిప్పిన మీసకట్టు విక్రమ్ సింగ్ రాథోడ్ ని గుర్తు చేస్తోంది. కథకు సంబంధించి ఎలాంటి పాయింట్ చిక్కకుండా కేవలం రవితేజని మాత్రమే వీడియోలో చూపించారు. ఇతర క్యాస్టింగ్ ఎవరూ లేరు.

ముందు ప్రకటించిన ప్రకారమైతే మే 9 మాస్ జాతర విడుదల కావాలి. కానీ ఇప్పుడీ టీజర్ లో డేట్ లేదు. ఏమైనా మారుస్తారేమో వేచి చూడాలి. గత ఏడాది రవితేజకు ప్రమాదం జరగకపోయి ఉంటే మొన్న సంక్రాంతికే వచ్చేది కానీ వాయిదా పడటం వల్ల షూటింగ్ లేట్ అయ్యింది. లేటెస్ట్ సెన్సేషన్ భీమ్స్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు.

ఇడియట్ లో బాగా పాపులరైన మనదే ఇదంతాని క్యాప్షన్ గా పెట్టి రవితేజతో పలికించిన తీరు కొత్తగా ఉంది. ఎప్పుడు వచ్చినా ఖాకీ చొక్కాలో మాస్ మహారాజా మరోసారి పవర్ ని మించిన మేజిక్ చేస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. ఆ నమ్మకాన్ని టీజర్ పెంచింది.