ఇంటర్వ్యూలు హిట్.. సినిమా ఫ్లాప్

2000 తర్వాత కోలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకడు. తొలి సినిమా ‘చెలి’ మొదలుకుని.. మూడేళ్ల కిందట వచ్చిన ‘వేందు తనిందదు కాడు’ వరకు ఆయన గొప్ప గొప్ప సినిమాలే తీశాడు. ఐతే ఒకప్పటితో పోలిస్తే ఆయన సక్సెస్ రేట్ పడిపోయింది. తన నిర్మాణ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో గౌతమ్ తీసిన సినిమాలు రిలీజ్ కావడం కూడా కష్టమైపోతోంది. ఇలాంటి టైంలో ఆయన మలయాళంలో మమ్ముట్టి హీరోగా ‘డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్’ సినిమా తీశాడు.

ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా గౌతమ్ ఇంటర్వ్యూలన్నీ భలేగా పేలాయి. విక్రమ్‌తో తీసిన ‘ధృవనక్షత్రం’ విడుదల కాకుండా ఆగిపోవడం.. ఆ కథను ముందు వేరే హీరోలకు చెబితే రిజెక్ట్ చేయడం గురించి ఆయన చెప్పిన సంగతులు.. ఇంకా తమిళ హీరోలు బడ్జెట్ గురించే తప్ప కథ గురించి ఆలోచించరంటూ చేసిన విమర్శలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘డొమినిక్..’ సినిమాకు బజ్ క్రియేట్ చేయడంలో గౌతమ్ ఇంటర్వ్యూలు కూడా కీలక పాత్ర పోషించాయి.

కానీ సినిమా హైప్ అయితే తెచ్చుకుంది కానీ.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం విఫలమైంది. ‘డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్’ చిత్రాన్ని గౌతమ్ వీకెస్ట్ మూవీస్‌లో ఒకటిగా ఆయన అభిమానులు తీర్మానిస్తున్నారు. మలయాళంలో వచ్చే పర్ఫెక్ట్ థ్రిల్లర్లతో పోలిస్తే ఈ సినిమా చాలా వీక్ అని అంటున్నారు. తొలి రోజు ఓపెనింగ్స్ వరకు ఓకే అనిపించినా.. ఆ తర్వాత ఈ చిత్రం నిలబడలేకపోతోంది. ఐతే ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా గౌతమ్ తన ఇంటర్వ్యూలతో మీడియా, సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాడు.

‘వేట్టయాడు విలయాడు’ చేస్తున్న సమయంలో తాను కమల్ హాసన్‌కు నటన పరంగా ఒక సలహా ఇస్తే ఆయన నొచ్చుకుని నిర్మాతలకు కంప్లైంట్ చేయడం గురించి.. ‘ధృవనక్షత్రం’ కథను రజినీకాంత్ ఓకే చేసినట్లే చేసి సాయంత్రానికి నో చెప్పడం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతులు చర్చనీయాంశంగా మారాయి.