మళ్ళీ ఛాన్స్ కొట్టేసిన సంక్రాంతికి వస్తున్నాం

క్రికెట్ మ్యాచ్ చివర్లో వచ్చి సెంచరీ కొట్టి గెలిపించిన టైపులో సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతూనే ఉంది. పది రోజులకే 230 కోట్ల గ్రాస్ ని దాటేసిన ఈ బ్లాక్ బస్టర్ ఇప్పుడు రెండో రౌండ్ కు సిద్ధపడుతోంది. నిన్న రిలీజైన కొత్త సినిమాలేవీ కనీస స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయాయి.

గాంధీ తాత చెట్టు మీద జనంలో పెద్దగా ఆసక్తి లేకపోవడంతో పాటు టాక్ అంతంతమాత్రంగా ఉండటం చూస్తే పికప్ అనుమానమే. హత్య ఓ మోస్తరుగా ఓకే అని వినిపించినా అది వసూళ్లుగా మారే సూచనలు తక్కువే. ఐడెంటిటీ థియేటర్లో షో పడకముందే ఓటిటి డేట్ ప్రకటించడంతో ఉన్న కాసింత ఆసక్తిని సున్నా చేశారు.

సో వీకెండ్ కి మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం బెస్ట్ ఛాయస్ కాబోతోంది. బుకింగ్ ట్రెండ్స్ లో ఇదే స్పష్టమవుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షో ద్వారా లక్షకు పైగానే టికెట్లు అమ్ముడుపోయాయి. శని ఆదివారాల్లో ఈ నెంబర్ డబుల్ అయినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలా చోట్ల గేమ్ ఛేంజర్ తీసేసి వెంకటేష్ కి స్క్రీన్లు పెంచుతున్నారు.

ఇంకోవైపు డాకు మహారాజ్ అంత పాజిటివ్ టాక్ తోనూ ఎలాంటి అద్భుతాలు చేయలేకపోతోంది. ఒక్కసారిగా స్లో అయిపోయింది. రెండు వందల కోట్ల గ్రాస్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు అఖండ 2 తాండవం దాకా వెయిట్ చేయడం తప్పేలా లేదు.

పుష్ప 2 తర్వాత మళ్ళీ ఆ స్థాయి దూకుడు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి వస్తున్నాంకే కనిపిస్తోంది. అందుకే నిర్మాత దిల్ రాజు భీమవరంలో భారీ ఎత్తున సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 7 తండేల్ వచ్చేదాకా పరిస్థితి ఇలాగే ఉండబోతోంది కనక దానికి అనుగుణంగా నాన్ స్టాప్ ప్రమోషన్లు చేయబోతున్నారు.

అందులోనూ దిల్ రాజు బ్యానర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం ఆ సంస్థకు ఒక సెలబ్రేషన్ లా మారిపోయింది. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్ మరికొన్ని రోజుల పాటు ఈ ఆనందాన్ని మీడియా, ప్రేక్షకులతో పంచుకుంటూనే ఉంటారట.