ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది. సంక్రాంతికి వస్తున్నాంతో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ మాస్ వర్గాలను ఆకట్టుకోవడంలో బాలయ్య మరోసారి విజయం సాధించారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఊర్వశి రౌతేలా ఆనందం మాములుగా లేదు. నిడివి పరంగా తక్కువ స్పేస్ దొరికినప్పటికీ గ్లామర్ పరంగా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా దబిడి దిబిడి పాటలో వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీశాయి. గతంలో వాల్తేరు వీరయ్యలో వేరీజ్ ది పార్టీలో చిరంజీవితో ఆడిపాడింది ఈ భామనే.
ఇదంతా ఓకే కానీ క్షమాపణ వ్యవహారం ఏంటో చూద్దాం. ఇటీవలే ఒక ముంబై మీడియా ప్రతినిధి ఊర్వశి రౌతేలాని ఇంటర్వ్యూ చేశాడు. సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి గురించి సుదీర్ఘమైన ప్రశ్న వేసి మీ స్పందన ఏంటో తెలియజేయమని చెప్పాడు. దానికి ఆమె సమాధానమిస్తూ బాధగా ఉందని, త్వరగా కోలుకోవాలని పొడిపొడిగా చెప్పేసి వెంటనే డాకు మహారాజ్ హిట్ అయిన సందర్భంగా తనకు తల్లి తండ్రులు ఇచ్చిన ఖరీదైన కానుకల గురించి చెప్పడం మొదలుపెట్టింది. రోలెక్స్ వాచ్, డైమండ్ రింగ్ గురించి గొప్పగా చెప్పింది. దీంతో ఆ వీడియో కాస్తా విపరీతంగా వైరలైపోయి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.
సందర్భం లేకుండా సైఫ్ గురించి మాట్లాడమంటే గిఫ్టుల గురించి చెప్పుకోవడం ఏమిటంటూ నెటిజెన్లు తలంటారు. దీంతో జరిగిన పొరపాటును గుర్తించిన ఊర్వశి రౌతేలా వెంటనే ఇన్స్ టా వేదికగా క్షమాపణ చెప్పింది. జరిగిన ఘటన తాలూకు తీవ్రత తెలియకుండా వేరే ప్రస్తావన చేశానని, దయచేసి క్షమించమని, ఈ మెసేజ్ సైఫ్ దాకా చేరుతుందని కోరుకుంటున్నట్టు అందులో పేర్కొంది. ఆ మధ్య తెలుగు ట్రోలింగ్స్ అర్థం చేసుకోలేక వాటిని షేర్ చేసుకుంది కూడా ఊర్వశినే. ఏదైతేనేం విజయానందంతో తానేం చేస్తోందో ఊర్వశి చెక్ చేసుకుంటున్నట్టు లేదు. దెబ్బకు ఈసారి మరింత జాగ్రత్తగా ఉండటం ఖాయం.