యానిమల్ స్ఫూర్తితో సినిమా తీశాడు కానీ…

అరుంధతి విలన్ సోను సూద్ స్వీయ దర్శకత్వంలో తీసిన ఫతే నిన్న విడుదలయ్యింది. గేమ్ ఛేంజర్ హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు కానీ పోటీ లేని కారణంగా టైం చూసి దింపిన నిర్మాతలు డీసెంట్ ఓపెనింగ్స్ అయితే దక్కించుకున్నారు. సోలో హీరోగా ఎలాంటి ఇమేజ్ లేని సోను సూద్ కు రియల్ లైఫ్ స్టార్ గా పేరుంది.

ముఖ్యంగా కరోనా టైంలో అతను చేసిన సహాయాలు ఎందరికో జీవితాలను ఇచ్చాయి. అందుకే ఫతే మీద సింపతీ ఫ్యాక్టర్ లేకపోలేదు. బుక్ మై షోలో నిన్న 20 వేల దాకా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్.

యానిమల్ స్ఫూర్తిని తీసుకున్న వైనం ఫతేలో స్పష్టంగా కనిపించింది. ఓపెనింగ్ ఎపిసోడే సూటు బూటు వేసుకున్న హీరో చేతిలో మెషీన్ గన్ను పట్టుకుని విలన్ల చోటికి వెళ్లి రక్తపాతం సృష్టిస్తాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఓపెనవుతుంది. పంజాబ్ లో ఒక్క చిన్న గ్రామంలో పాల వ్యాపారం చేసుకునే ఫతే సింగ్ దగ్గర పని చేసే ఒక ఉద్యోగి లోన్ యాప్స్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు.

దీని గురించి తెలుసుకునే పనిలో ఉండగా తన ఇంట్లోనే ఉండే యువతిని సైబర్ క్రైమ్ ముఠా ఎత్తుకెళ్లిపోతుంది. దీంతో రంగంలోకి దిగిన ఫతేకు ఊహించని సవాళ్లు, ప్రధమాలు ఎదురవుతాయి. అసలు కథ ఇక్కడి నుంచే ఉంటుంది.

పాయింట్ పరంగా కొత్తదనం లేని ఫతేని సోను సూద్ మరీ రొటీన్ స్క్రీన్ ప్లేతో నడిపించాడు. విలన్లను వెతికి పట్టుకునే క్రమంలో ఫతే చేసే పనులు, సాహసాలు ఎలాంటి థ్రిల్ ఇవ్వకపోగా చప్పగా అనిపిస్తాయి. విపరీతమైన హింస, చంపడాలు అయితే ఉన్నాయి కానీ వాటిని నిలబెట్టేందుకు కావాల్సిన ఎమోషన్, ఎలివేషన్ రెండూ మిస్సయ్యాయి.

రెండు మూడు ఫైట్లు, ఛేజులు బాగున్నప్పటికీ మొత్తాన్ని నిలబెట్టడానికి సరిపోలేదు. జాక్వలిన్, నసీరుద్దీన్ షా తదితరుల పాత్రల డిజైనింగ్ సరిగా లేదు. ఎంత రొటీన్ ఉన్నా పర్వాలేదు సోను కోసం చూస్తామనుకుంటే తప్ప ఫతేని రికమండ్ చేయడానికి ఎలాంటి కారణం ఉండదు.