సైలెంట్ కిల్లర్ అవుతున్న వెంకీ మామ

పండగ సినిమాల్లో ఖర్చుపరంగా చూసుకుంటే తక్కువ బడ్జెట్ తో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు డిమాండ్ పెంచుకునే స్థాయికి చేరుకుంది. ట్రైలర్ మరీ అత్యద్భుతంగా అనలేం కానీ కామెడీ వర్కౌట్ అయ్యేలా ఉందనే హామీ దక్కడంతో బయ్యర్ల ఆసక్తి దీని మీద పెరిగిపోయింది. ఉత్తరాంధ్రలోని ఒక చిన్న సెంటర్ కు పదమూడు లక్షలకు ఎగ్జిబిటర్ పాడుకుంటే థర్డ్ పార్టీ వచ్చి రెండు లక్షలు ఎక్కువ ఇచ్చి కొంటానన్నా ససేమిరా వద్దని చెప్పి థియేటర్ వాళ్లే వేసుకుంటున్నారట. దీన్ని బట్టి గ్రౌండ్ లెవెల్ లో ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకీ మామకు ఎంత మద్దతు దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు.

రేపు తెల్లవారుఝామున వచ్చే గేమ్ ఛేంజర్ టాక్, ఆదివారం డిసైడయ్యే డాకు మహారాజ్ రిజల్ట్ ని బట్టి సంక్రాంతికి వస్తున్నాంకు ఎన్ని థియేటర్లు సర్దుబాటు చేయాలనే దాని మీద పంపిణీదారులు ముందస్తుగా ఒక ప్లానింగ్ లో ఉన్నారని వినికిడి. ముందుగా జరిగిన అగ్రిమెంట్ల ప్రకారమే మూడు సినిమాల షోలు వేసుకున్నా సరే పండగ రోజుల్లో డిమాండ్ లో హెచ్చుతగ్గులని బట్టి ఇచ్చిపుచ్చుకోవడాలు చేయొచ్చని ట్రేడ్ న్యూస్. ఎఫ్2, ఎఫ్3 కాంబినేషన్ తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు ఎక్కడ లేని నమ్మకాన్ని తీసుకొచ్చింది. దానికి తోడు వెరైటీగా చేస్తున్న ప్రమోషన్లు హైప్ ని పెంచేస్తున్నాయి.

ఒకవేళ మూడు సినిమాలు హిట్టయినా సరే ఎక్కువ లాభపడేది మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమానే. ఎందుకంటే థియేటర్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ త్వరగా చేరుకునే అవకాశం దీనికే ఉంది. దీనికి తోడు ఏపీ నుంచి మొదట టికెట్ రేట్ హైక్స్ వచ్చేసాయి. రామ్ చరణ్, బాలకృష్ణ సినిమాలంత బడ్జెట్ దీనికి కాకపోయినా సరే పెంపు ఇవ్వడం పెట్టుబడి కోణంలో పెద్ద ప్రయోజనం అవుతుంది. కావాల్సిందల్లా పాజిటివ్ టాక్. మాస్ ప్లస్ ఫ్యామిలీ పల్స్ పట్టడంలో రావిపూడి పట్టు, వెంకీ కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే కాబట్టి ఈ రెండు సరిగ్గా కుదిరాయంటే మాత్రం వసూళ్ల పండగ ఖాయం.