నిన్న విడుదలైన అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ ఒక సినిమాని వదిలేసుకోవాల్సి వచ్చిందనే మాట అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. అదేంటనేది బాలకృష్ణ అడగలేదు కానీ ఏమై ఉంటుందనే అనుమానం ఫ్యాన్స్ లో మొదలయ్యింది. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే యువి క్రియేషన్స్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఒక భారీ ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసుకున్న సంగతి మూవీ లవర్స్ కి గుర్తే. కొన్ని నెలల తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత గౌతమ్ హీరో విజయ్ దేవరకొండతో ఒకే చేయించుకున్న కథ ఇదేననే టాక్ వచ్చింది.
ఇది నిజమో కాదో కానీ గేమ్ ఛేంజర్ పరిణామాలు గమనిస్తే పైన చెప్పిన కాంబోతోనే మ్యాచ్ అవుతోంది. దర్శకుడు శంకర్ ఒకేసారి ఇండియన్ 2 కూడా తీయడం వల్ల చరణ్ మూడేళ్ళ సమయం దీనికే గడిచిపోయింది. అనూహ్యంగా భారతీయుడు 2 డిజాస్టర్ కావడం గేమ్ ఛేంజర్ హైప్ మీద ప్రభావం చూపించింది. అయితే వింటేజ్ శంకర్ మళ్లీ వెనక్కు వస్తాడనే నమ్మకం సినీ ప్రియుల్లో బలంగా ఉంది. ఇంత త్యాగం చేసినందుకు రామ్ చరణ్ కు హిట్టు దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోలో హీరోగా వినయ విధేయ రామ తర్వాత మళ్ళీ స్క్రీన్ మొత్తం కనిపించబోయే సినిమా ఇదే. అందుకే ఇంత హైప్.
మరి తాను వదిలేసింది విజయ్ దేవరకొండకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. గతంలో ఒక స్టార్ హీరో వద్దకున్నది మరో స్టార్ హీరో చేసి బ్లాక్ బస్టర్స్ సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇలాగే ఇడియట్, అతడు, పోకిరిని మిస్ చేసుకున్నారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఆర్సి 16 కన్నా ముందు దర్శకుడు బుచ్చిబాబు ట్రై చేసింది జూనియర్ ఎన్టీఆర్ ని. కానీ కుదరలేదు. ఈలోగా చరణ్ తో లాక్ చేసుకున్నాడు. రెండూ ఒకటే కథనా కాదానేది బయటికి రాలేదు. ఏదైతేనేం ఇంత జరిగిన దానికి గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ అయితే అదే చాలనుకుంటున్నారు మెగాభిమానులు.