పవన్ ప్రసంగంలో ఆలోచింపజేసే విషయాలు!

రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో సినిమాలకు సంబంధించిన కబుర్లతో పాటు రాజకీయ మెరుపులు కూడా తోడయ్యాయి. టికెట్ రేట్ల కోసం హీరోలు వచ్చి నమస్కారం పెట్టి ప్రాధేయపడటం గుర్తు చేస్తూ అలాంటి నియంతృత్వ పోకడ తమ ప్రభుత్వంలో ఉండదని, ఈ విషయంలో తమకు స్వర్గీయ ఎన్టీఆరే స్ఫూర్తని చెప్పడం ఆహుతులను ఆకట్టుకుంది.

నిర్మాతలు, కౌన్సిల్ బాడీలు, అసోసియేషన్లు వచ్చి అడిగితే అనుమతులు మంజూరు చేస్తామని, అంతే తప్ప హీరోలే రావాలనే కట్టుబాటు తమ దగ్గర ఉండదని స్పష్టం చేశారు.

మనల్ని మనం టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ అని విభజించుకోకూడదని, ఇదంతా ఇండియన్ సినిమా అంటూ వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ లో స్టూడియోలు నిర్మించడంతో పాటు 24 క్రాఫ్ట్స్ కు సంబంధించి ఇక్కడి యువతకు, ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని వేదిక మీదే ఉన్న తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ దిల్ రాజుని ఉద్దేశించి అన్నారు.

కావాలంటే త్రివిక్రమ్, రాజమౌళి, తమన్ లాంటి వాళ్ళతో ఇక్కడ క్లాసులు చెప్పించి స్కిల్స్ పెంచే దిశగా ఏదైనా ప్రణాళిక వేయమని కోరడం ఆచరణ సాధ్యాసాధ్యాల గురించి ఆలోచింపజేసేలా ఉంది.

టికెట్ రేట్ల పెంపు గురించి మాట్లాడుతూ డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ధరలు నిర్ణయించడం జరుగుతుందని, బ్లాక్ మార్కెట్ ని అరికట్టడం ద్వారా అధికంగా పెంచిన రేటు ద్వారా గవర్నమెంట్ కు ఆదాయం పెరుగుతుందని వివరించడం ఆకట్టుకుంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇండస్ట్రీకి సహకారం అందించేందుకు ఎప్పడూ సిద్ధంగా ఉంటారని చెప్పి సినీ పరిశ్రమకు బహిరంగ ఆహ్వానం అందించారు. సవివరంగా, విశ్లేషణాత్మకంగా పవన్ కళ్యాణ్ చెప్పిన చాలా విషయాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. వీలైనంత త్వరగా కార్యాచరణ జరిగితే మాత్రం టాలీవుడ్ మరింత ఎత్తులు చూస్తుంది.