పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి అభిమానులకు కొత్తగా చెప్పేందుకు ఏం లేదు కానీ పబ్లిక్ స్టేజి మీద ఇద్దరూ కలుసుకునే సందర్భాన్ని మాత్రం ప్రతిసారి ఫ్రెష్ గా ఫీలవుతారు. రెగ్యులర్ గా రాదు కాబట్టి ఎప్పుడు జరిగినా అదో అరుదైన కలయికగానే కనిపిస్తుంది.
కుటుంబంలో నిత్యం కలుసుకోవడం మాములే కానీ లక్షలాది మధ్య బయటికి వస్తే ఫ్యాన్స్ కి ఆ కిక్కు వేరుగా ఉంటుంది. రంగస్థలం సక్సెస్ మీట్ లో అలాంటి హై ఎంజాయ్ చేశాక చాలా గ్యాప్ వచ్చేసింది. తాజాగా రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మరోసారి చరణ్ మీద ప్రశంసలు గుప్పించారు.
ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. “రామ్ చరణ్ పుట్టినప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. అన్నయ్యకి అబ్బాయి పుట్టాడని చెప్పి నామకరణం చేశారు. ఇంట్లో అందరికీ ఆంజనేయస్వామి పేరు రావాలని నాన్నగారు… రాముడి పాదాల దగ్గర ఉండేవారు ఎవరు ఆంజనేయుడు కాబట్టి ఆ పేరు పెట్టారు.
బలముండి కూడా వినయ విధేయలతో ఉండే వ్యక్తి ఆ స్వామి. ఎంత ఎదిగినా ఎంత శక్తిమంతుడైనా, అణిమాది అష్టసిద్దులున్నా ఒదిగే ఉండాలనే ఉద్దేశంతో రామ్ చరణ్ అని పెట్టారు. చిరంజీవి నాకు పితృ సమానులు, వదిన నాకు తల్లి. అందుకే చరణ్ నాకు తమ్ముడు. ఇంట్లో ఏడిపించేవాడిని”
“నేను అప్పట్లో తమ్ముడులో హీరో లాగా అల్లరిగా ఉంటే తొమ్మిదేళ్ల వయసులోనే ఉదయాన్నే హార్స్ రైడింగ్ చేసేవాడు రామ్ చరణ్. మొత్తం హెల్మెట్ తో పాటు అన్ని పెట్టుకుని షూస్ అన్నీ సర్దుకుని నేను సోఫాలో పడుకుని ఉంటే లేపేవాడు. అంత క్రమశిక్షణతో ఉండేవాడు.
ఇంత శక్తి సమర్ధత ఉందని నాకు తెలియలేదు. వ్యక్తిగతంగా డాన్స్ చేయడం చూడలేదు. సినిమాల్లోనే చూశా. రంగస్థలంలో గోదావరి యాసతో నటనకు ముగ్డుడయ్యా, భవిష్యత్తులో తప్పకుండా ఉత్తమ నటుడు అనే అవార్డు అందుకోవాలి” ఇలా సుదీర్ఘంగా చరణ్ గొప్పదనం వర్ణించిన పవన్ కళ్యాణ్ మాటలకు మెగా ఫ్యాన్స్ ఆనందం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా.