బ్రాహ్మణికి మణిరత్నం సినిమా ఆఫర్? : బాలయ్య ఏమన్నారంటే…

చాలామంది సినీ నటుల నట జీవితాన్ని వారు నటించిన సినిమాలను లెక్క చూపించి.. దానికి ముందు.. దాని తర్వాత అంటూ విభజిస్తారు. కానీ.. నందమూరి బాలక్రిష్ణను అలా చెప్పలేం. ఎందుకుంటే.. ఆయన నట జీవితం మొత్తం ఒక ఎత్తు. ఆయన షురూ చేసిన ఆన్ స్టాపబుల్ మరో ఎత్తు. నిజానికి మరే చిత్ర హీరోకు దక్కని ఇమేజ్ ఈ షో ద్వారా బాలయ్యకు దక్కిందని చెప్పాలి.

అందరి మనసుల్లో ఉండే బాలక్రిష్ణకు.. అన్ స్టాపబుల్ షోలో కనిపించిన బాలయ్యకు పోలిక లేకపోవట.. తమ మనసుల్లో ఆయన ఉంటారనుకునే దానికి భిన్నంగా ఆయన తీరు ఉండటం అందరిని విపరీతంగా ఆకర్షించింది. అంతేకాదు..ఓటీటీ ప్లాట్ ఫాం మీద బాలయ్య అన్ స్టాపబుల్ షో అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. ప్రతి సీజన్ లో తన గ్రాఫ్ ను పెంచుకుంటూ పోవటమే కాదు.. ఆయన సమయస్ఫూర్తి.. ఆయన చిలిపిదనంతో పాటు.. అంచనాలకు మించిన ఆయన వైఖరి అందరిని ఫిదా అయ్యేలా చేస్తోంది.

ఇప్పుడు ఈ షో సీజన్ 4 నడుస్తోంది. ఇందులో భాగంగా ఎపిసోడ్ 8లో దర్శకుడు బాబీ.. సంగీత దర్శకుడు తమన్.. నిర్మాత నాగవంశీ అతిధులుగా పాల్గొన్నారు. ఎవరితోనైనా సందడి చేసే బాలయ్య.. ఈ ఎపిసోడ్ లోనూ తన ఎనర్జీ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఇంతవరకు ఎప్పుడూ చప్పని ఆసక్తికర అంశాల్ని ఈ ఎపిసోడ్ ద్వారా వెల్లడించారు.

తన కుమర్తె బ్రాహ్మణికి వచ్చిన మూవీఆఫర్ వివరాలు వెల్లడించి.. అందరిని సర్ ప్రైజ్ చేశారు. నిజానికి బ్రాహ్మణికి మూవీ ఆఫర్ల మీద చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఆమెకు సినిమాల్లో యాక్ట్ చేయటం ఇష్టమని.. ఆమె ఇంట్లో అడ్డుకున్నట్లుగా ఎవరికి తోచిన విషయాల్నివారు రాయటం ఇంటర్నెట్ లో కనిపిస్తుంది. అయితే.. అసలు వాస్తవం ఏమిటన్న విషయాన్ని బాలయ్య ఈ షో ద్వారా చెప్పేశారు.

మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారన్న తమన్ క్వశ్చన్ కు బదులిచ్చిన బాలయ్య.. ఇద్దరినీ గారాబంగానే పెంచానని చెప్పారు.ఈ సందర్భంగా బ్రాహ్మణికి.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమా ఆఫర్ ఇవ్వటాన్ని గుర్తు చేసుకున్నారు. ‘మణిరత్నం గారు అప్పట్లో ఒక సినిమా కోసం హీరోయిన్ గా బ్రాహ్మణిని అడిగారు. ఆ విషయాన్నిఆమెకు చెబితే.. నా ముఖాన్ని అడిగారా? అని బదులిచ్చిందని.. అవును.. ఆమె ముఖాన్ని చూసే అడుగుతాన్నారని చెప్పా.

చివరకు తనకు ఆసక్తి లేదని చెప్పింది. చిన్నమ్మాయి తేజస్విని మాత్రం అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేది. తను అయినా నటి అవుతుందని అనుకున్నా. చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ షోకు ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్. ఎవరి రంగంలో వారు మంచి పేరు తెచ్చుకున్నారు’’ అంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. తన ఇద్దరు కుమార్తెలు సాధించిన విజయాల్ని బాలయ్య ఆసక్తి చెబుతూ.. ‘‘వాళ్ల తండ్రిని నేను అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు.

అంతకు మించి కావాల్సింది ఏముంటుంది. నేను భయపడేది బ్రాహ్మణికే’’ అని చెప్పటం ద్వారా.. బ్రాహ్మణికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలాన్ని పెంచారని చెప్పాలి. తాజాగా సంక్రాంతి రేసులో నిలిచిన బాలయ్య ‘డాకూ మహారాజ్’ కు నాగవంశీ నిర్మాత కాగా.. తమన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి బాబీ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది.