‘గేమ్ చేంజర్’ టీంకు సెన్సార్ బోర్డు చురక

తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెట్టాలన్న స్పృహ రాను రాను తగ్గిపోతూ వస్తోంది. ఈ ఒరవడి తెలుగులోనే కాదు.. వేరే భాషల్లోనూ చూస్తున్నాం. కానీ చివరికి చూస్తే సినిమా అనేది ఒక వ్యాపారం కాబట్టి ఈ విషయంలో ఎవరినీ నిందించలేం, డిమాండ్ కూడా చేయలేం. ఎవరికి వాళ్లు తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెట్టడం మీద సారించాల్సిన అవసరం ఉంది. ఐతే పేర్లు తెలుగులో పెట్టకపోయినా.. కనీసం వాటి లిపి అయినా తెలుగులో ఉండేలా చూడడం ఫిలిం మేకర్స్ బాధ్యత.

కానీ పాన్ ఇండియా సంస్కృతి పెరిగిన నేపథ్యంలో వేర్వేరు భాషల్లో టైటిళ్లు డిజైన్ చేయించడం ఎందుకని ఇంగ్లిష్‌లోనే టైటిల్ డిజైన్ చేయించి.. అన్ని భాషలకూ కామన్‌గా అదే పెట్టేస్తున్నారు. సంక్రాంతి సినిమా ‘గేమ్ చేంజర్’ విషయంలోనూ టీం అలాగే చేసింది. కామన్‌‌గా ఇంగ్లిష్ టైటిల్ పెట్టేసి.. దాన్ని ఇంగ్లిష్ లిపిలోనే డిజైన్ చేయించారు. ఐతే ఈ ఒరవడిని సెన్సార్ బోర్డు తప్పుబట్టినట్లు సమాచారం. ‘గేమ్ చేంజర్’ తెలుగు వెర్షన్ సెన్సార్ తాజాగా పూర్తయింది.

సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు.. టైటిల్ డిజైన్ మీద అభ్యంతరం వ్యక్తం చేసిందట. తెలుగు సినిమాకు తెలుగు టైటిల్ పెట్టకపోయినా.. కనీసం లిపి అయినా తెలుగులో ఉండేలా చూసుకోవాలి కదా అని సెన్సార్ బోర్డు వాళ్లు అన్నట్లు సమాచారం. ఐతే ఈ విషయంలో సెన్సార్ బోర్డు.. చిత్ర బృందాన్ని ఆదేశించే పరిస్థితి లేదు. అందుకే తెలుగు మాత్రమే చదవడం తెలిసిన వాళ్లకు ఇబ్బంది రాకుండా టైటిల్ తెలుగు లిపిలోకి మార్చమని సూచన మాత్రమే చేశారట.

ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలని సెన్సార్ వర్గాల టాక్. అంటే ఇది కొంచెం పెద్ద సినిమానే అన్నమాట. ఈ రోజుల్లో ఎక్కువగా పెద్ద సినిమాలు ఎక్కువ రన్ టైంతోనే రిలీజవుతున్నాయి. ‘పుష్ప-2’ చిత్రాన్ని ఏకంగా 3 గంటల 20 నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు. మంచి ఫలితమే వచ్చింది. సినిమా ఆసక్తికరంగా సాగితే రన్ టైం పెద్ద సమస్యే కాదని చాలా సినిమాలు రుజువు చేశాయి. ‘గేమ్ చేంజర్’ కూడా అదే విషయాన్ని రుజువు చేస్తుందేమో చూద్దాం.